పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు తమకెంతో స్ఫూర్తినిస్తున్నాయని, అన్నక్యాంటీన్ల నిర్వహణకోసం తాము 3,32,500 విరాళంగా ఇస్తున్నట్లు రాజధాని ప్రాంత రైతులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కష్టాలలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారని, ఈ దశలో తాము అండగా నిలవాలని నిశ్చయించామని వారన్నారు. అందుకే అన్నక్యాంటీన్ల నిర్వహణకు విరాళమిచ్చామని వివరించారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో మందడం, ఉండవల్లి, కృష్ణాయపాలెం, తాళ్లాయపాలెం రైతులున్నారు.
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తనపై ఎంతో విశ్వాసంతో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ఫలాలు అందుకునే మొదటి లబ్దిదారులు రైతులేనని, అమరావతి అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేసి లబ్ది చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లి లోని ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో వచ్చి తనను కలసిన రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు మాట్లాడారు. ప్రశాంత సరోవరంలో రాళ్లు వేసినట్లు కొందరు రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఇది సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. చేతనైతే తమతో కలసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.50,000 కోట్లతో ఇప్పటికే పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
‘మా ప్రాంతంలో రాజధాని నిర్మాణం మాకెంతో గర్వకారణం. భూ యజమానులమైన తాము స్వచ్ఛందంగా తమ భూములను స్వచ్ఛందంగానే సమీకరణ విధానంలో ఇచ్చాం. ఇందులో ఎవరి బలవంతం లేదు. కొన్ని శక్తులు పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి రెచ్చగొడుతున్నాయి’ అని రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ‘భూములు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, తమను ఎవరూ ఒత్తిడి చేయలేదని వారు చెప్పారు. ‘మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. మా ప్రాంతంలో రాజధాని నిర్మించడం మాకెంతో గర్వకారణం. ఈ ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. మీమీద విశ్వాసంతోనే రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చాం. మరో పదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని మా ఆకాంక్ష’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని ప్రాంత రైతులు అన్నారు.