ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో, నిన్న అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో, అమరావతి ప్రాంతంలోని రైతులు షాక్ తిన్నారు. అమరావతి కేవలం లెజిస్లేటివ్ కాపిటల్ అని, జగన్ ప్రకటించటంతో, రైతులు అవాక్కయ్యారు. ఆరు నెలల నుంచి జగన్ మోహన్ రెడ్డి, మంచి నిర్ణయం ప్రకటిస్తారని ఎదురు చూస్తూ, తమ కొంప ముంచే నిర్ణయం తీసుకున్నారని రైతులు ఆందోళన బాట పట్టారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు, ఒక్క చిన్న ఆందోళన కూడా లేకుండా 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, ఈ రోజు మాత్రం జగన్ ప్రకటనతో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు విజన్ నచ్చి ఆయన పై నమ్మకంతో, 33 వేలు ఎకరాలు ఇచ్చామని, ఆరు నెలల నుంచి మంత్రులు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నా, తమకు జగన మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ఆయన తమ పట్ల సానుకూల నిర్ణయం ప్రకటిస్తారని అనుకున్నామని, ఇప్పుడు మమ్మల్ని ముంచేసారని రాజధాని రైతులు వాపోయారు.
రాజధాని గ్రామాలు అయిన వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్ల పై బైఠాయించి జగన మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక వెంకటాయపాలెం గ్రామంలో, రైతులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇక జగన్ ప్రకటనకు నిరసనగా తుళ్లూరులోని రైతులు, పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, తమ గోడు వినాలని, లేకపోతే అందరం ఈ పురుగులు మందు తాగి చచ్చిపోతామని అన్నారు. రైతుల ఆందోళన గంట గంటకు తీవ్రం అవుతున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలగటంతో, పోలీసులు క్లియర్ చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం, తమను అన్యాయం చేసారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారని అన్నారు. అసలు దక్షిణాఫ్రికాను ఆదర్శంగా ఎలా తీసుకుంటారని, అది ఒక దేశం అని, మనది ఒక చిన్న రాష్ట్రం అని, దానికి దీనికి పోలిక ఎలా పెడతారని అంటున్నారు. ఇప్పటికే కట్టిన పెద్ద పెద్ద భవనాలను ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము ఇచ్చిన భూములు ఇప్పటికే ఫ్లాట్ లు చేసి ఇచ్చారని, తమ భూములు తమకు ఇచ్చేసి, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ కొంత మంది రైతులు ఆందోళన బాట పట్టారు. భూములు ఇచ్చే సమయంలో కూడా ఆందోళన లేకుండా ఇచ్చామని, ఇప్పుడు తమను రోడ్డు ఎక్కించారని, రైతులు ఆందోళన వ్యక్తం చేసారు.