టీవీల్లో కాని, సోషల్ మీడియాలో కాని, అమరావతి పై, ఎక్కువగా పాజిటివ్ న్యూస్ ఉండదు. అక్కడ ఏమి జరుగుతుందో సరిగ్గా ప్రజలకు తెలియదు. సోషల్ మీడియాలో విష ప్రచారం నమ్మి, అమరావతిలో అసలు ఏమి జరగటం లేదు అనే అభిప్రాయంలో ఉంటారు ప్రజలు. కాని గ్రౌండ్ జీరోలో అమరావతి చూసినవారు మాత్రం, జగన్, పవన్ అంటునట్టు అది భ్రమారావతి కాదని, అమరావతి అనే అద్భుత నగరం ఆవిష్కృతం అవుతుందని గుర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గన్నవరం రైతులకు ఎదురైంది. రాజధాని నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గన్నవరం ప్రాంత రైతులు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇన్ని పనులు ఇక్కడ జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు. అమరావతి పై జరుగుతున్న విష ప్రచారం, తప్పు అని తెలుసుకున్నారు.
గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూము లనిచ్చిన గన్నవరం, బుద్ధవరం, అజ్జంపూడి, చిన్నావుటపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 40 మందిని సీఆర్డీయే 2 ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకుని వెళ్లింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్, కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు కడియాల రాఘవరావు, విజయ వాడ కార్పొరేటర్ దేవినేని అపర్ణ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరందరికీ రాజధానిలో జరుగుతున్న పనుల గురించి, వారికి ఇవ్వదలచిన రిటర్నబుల్ ప్లాట్ల గురించి సీఆర్డీయే ప్లానింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఎస్.ఇ. ధనుంజయ తదితర అధికారులు వివరించారు.
విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయం నుంచి ఉదయం బయల్దేరిన రైతులు తొలుత అమరావతికి ముంపు బెడదను తప్పించేం దుకు ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయిస్ వద్ద భారీఎత్తున నిర్మిస్తున్న కొండవీటి వాగు మళ్లింపు పథకాన్ని పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా ప్రయాణించి, కొండమరాజుపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సీఆర్డీయే ప్రాజెక్టు కార్యాలయాన్ని, రాయపూడి, నేలపాడుల్లో శాసనసభ్యులు, ఏఐఎస్ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్ సముదాయా న్ని చూశారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ఆయా నిర్మాణాలు వేగంగా, పకడ్బందీగా జరిగేందుకుగాను అనుసరిస్తున్న షియర్ వాల్ సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు.
పనులు జరుగుతున్న జ్యుడీషియల్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రదేశంతో పాటు ప్రతిపాదిత ఐకానిక్ కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టు కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. 5 ఆకాశహర్మ్యాల తో రూపుదాల్చబోతున్న శాశ్వత సచివాలయ సముదాయపు ప్రదేశాన్ని కూడా చూశారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాధా న్య రహదారులను కూడా చూసిన గన్నవరం ప్రాంత రైతులు తుళ్లూరులో తమకు ఇచ్చేందుకు సీఆర్డీయే ప్రతిపాదించిన రిటర్నబుల్ ప్లాట్లను సైతం పరిశీలించారు.