ప్రజారాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మొట్టమొదటి హౌసింగ్ ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం శ్రీకారం చుట్టారు. ఒకపక్క అంతర్జాతీయ ప్రమాణాలతో, మరొకపక్క అన్ని వర్గాలకూ అందుబాటు ధరలో ‘హ్యాపినెస్ట్’ పేరిట ఏపీసీఆర్డీయే నిర్మించనున్న ఈ భారీ హౌసింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన లోగో, బ్రోచర్‌ను సీఆర్డీయే సమీక్ష సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పలు విశేషాలను కళ్లకు కట్టేలా సీఆర్డీయే ప్రదర్శించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది.
వాస్తుకు పూర్తి అనుగుణంగా, అదే సమయంలో ‘స్మార్ట్’గా, పర్యావరణహితంగా, సకల ఆధునిక వసతులతోపాటు చూడగానే ఆకట్టుకునే రూపం, సువిశాల క్లబ్‌హౌస్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలతో జెనెసిస్ సంస్థ రూపొందించిన డిజైన్ ప్రకారం హ్యాపీనెస్ట్ నిర్మితం కానుంది. సదరు విశేషాలిలా ఉన్నాయి. హ్యాపీనె్‌స్టకు సంబంధించిన ప్రధాన ఆకర్షణ దాని లొకేషన్! అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ గృహసముదాయాలతో కూడిన గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు ఇంచుమించుగా పక్కన, నేలపాడుకు చేరువలో ఇది రానుంది. అటూ ఇటూ 82అడుగుల వంతున వెడల్పుతో సాగే విశాలమైన 2 రహదారుల మధ్యన ఉన్న కార్నర్ ప్లాట్‌లో 14.46 ఎకరాల్లో హ్యాపీనెస్ట్ నిర్మితం కానుంది. ఇందులో ఒక్కొక్కటి రెండేసి పార్కింగ్ ఫ్లోర్లు, గ్రౌండ్ ప్లస్ 18 అంతస్థులుండే 12టవర్లు వస్తాయి. వీటిల్లో మొత్తం 1200 డబుల్, ట్రిబుల్ బెడ్రూం ప్లాట్లు ఉంటాయి.
వివిధ వర్గాలవారికి అందుబాటులో ఉండేలా వీటిని 6 సైజుల్లో.. 1285, 1580, 1700, 1965, 2230, 2735 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటి ధరను ప్రాథమికంగా చదరపు అడుగుకు రూ.3,500లుగా సీఆర్డీయే నిర్ణయించింది. ఆన్లైన్లో అప్లికేషన్ల ద్వారానే వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించిన ఈ సంస్థ నవంబర్ 9వ తేదీ నుంచి అమ్మకాలను ప్రారంభించనుంది. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ప్రాతిపదికన ఫ్లాట్లను కేటాయించనున్నారు. తొలిదశలో 7.3 ఎకరాల్లో 600 ఫ్లాట్లను మాత్రమే నిర్మించి, ఆ తర్వాతి దశలో మిగిలిన 600 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయించారు. అపార్ట్మెంట్లన్నీ తూర్పు, పడమర ఫేసింగ్‌తోనే, అదీ కార్నర్‌వే అయి ఉంటాయి. కేటాయించిన మొత్తం స్థలంలో సుమారు 80 శాతాన్ని పచ్చదనానికి, ఓపెన్ ఏరియాలకు నిర్దేశిస్తారు. అంటే కేవలం 20 శాతం భూమిలోనే నిర్మాణాలు వస్తాయి.