ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్య‌క‌లాపాలు బుధవారం మొద‌ల‌య్యాయి. గ‌డిచిన 56 ఏళ్లుగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు హైద‌రాబాద్‌లో కొన‌సాగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జ‌న‌వ‌రి 1వ తేదీని అపాయింట్ మెంట్ డే గా నిర్ణ‌యించి, హైకోర్టు విభ‌జ‌నకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్‌గా ప్ర‌వీణ్ కుమార్‌, ఆయనతో పాటు మ‌రో 13 మంది న్యాయ‌మూర్తులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైకోర్టు భ‌వ‌నం మరో నెలరోజుల్లో అందుబాటులోకి వ‌స్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈలోగా తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హిస్తున్నారు.

amaravati 02012019

ఈ రోజు (జ‌న‌వ‌రి 2వ తేదీ) నుంచి ఏపీ హైకోర్టులో కేసుల విచార‌ణను ప్రారంభించారు. తొలి కేసు విశాఖ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థకు సంబంధించినది. రిట్ పిటిష‌న్ నెం. 1731/2018 గా న‌మోద‌యిన విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ కేసు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో పిటిష‌న‌ర్లు.. జీవీఎంసీ క‌మిష‌న‌ర్, జీవీఎంసీ జోన్-2 జోన‌ల్ క‌మిష‌న‌ర్ కాగా, రెస్పాండెంట్స్ (ప్రతివాదులు) గాజుల శోభారాణి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మునిసిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ, విశాఖ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ. 2018 న‌వంబ‌ర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఈ పిటీష‌న్ దాఖ‌ల‌య్యింది. ఈ కేసులో పిటిష‌న‌ర్ల త‌రుపున న్యాయవాది ఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ రెడ్డి వాదిస్తుండ‌గా, ప్ర‌తివాదుల ప‌క్షాన న్యాయవాది ప‌రావ‌స్తు కృష్ణ వాదిస్తున్నారు.

amaravati 02012019

దీంతో పాటు మొత్తం 12 కేసులపై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే తొలి రోజు కేసుల విచార‌ణ జ‌ర‌గ‌కుండానే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వాటిని వాయిదా వేశారు. ఇక తొలి రోజు మరో విశేషం ఏంటి అంటే, తెలుగులో మొట్టమొదటి పిటిషన్ వేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన న్యాయవాది ప్రకాష్ మాట్లాడుతూ 2012లో తొలిసారిగా పుంగనూరు కోర్టులో పిటిషన్ వేశానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగులోనే అన్ని దావాలు, కేసులను దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. 2012-13లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు జస్టిస్ ఎల్వీ రమణ తెలుగులో కేసులు దాఖలు చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని ఒక సందేశం ఇచ్చారని, ఆయన సూచనలు పాటిస్తూ తెలుగులో కేసులు వేస్తూ.. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రకాష్ చెప్పారు. ఇదే మొదటి కేసని, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరూ దాఖలు చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పాలకొల్లులో ఉన్న న్యాయమూర్తి మోతీలాల్ కూడా తెలుగు భాషలో తీర్పులు ఇస్తున్నారని ఆయన తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read