ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికి దీటుగా అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. సోమవారం రాత్రి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో ముఖ్యమంత్రిని కలిసి నూతన రాజధానిలో తలపెట్టిన ట్విన్ టవర్ నిర్మాణంపై వివరించారు. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా వంటి కట్టడాలు ఉన్నాయని, మలేసియా, సింగపూర్ వంటి దేశాలలో ఈ తరహా నిర్మాణాలను చేపట్టారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటన్నింటికీ లేని ఆకర్షణలు అమరావతిలో వున్నాయని గుర్తుచేశారు.
పుష్కలంగా కనిపించే జల సంపద, మైమరపించే పచ్చదనంతో పాటు క్రియాశీలకంగా ఉండే పౌరులు మన కొత్త రాజధానికి ప్రధాన వనరులని చెప్పారు. వీటన్నింటి కారణంగా ఇక్కడ ఏర్పాటుచేసే జంట టవర్లు పర్యాటకాన్ని, వాణిజ్య రంగాన్ని బాగా ఆకర్షించగలవన్నారు. ఈ జంట కట్టడాల నిర్మాణం అమరావతి ఖ్యాతిని ద్విగుణీకృతం చేయాలని ఆకాంక్షించారు.
తాము రూపొందించిన అమరావతి ఐకానిక్ ట్విన్ టవర్ ఆకృతులు, నిర్మాణ వ్యూహంపై షాపూర్ జీ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ జంట కట్టడాలలో కార్యాలయ స్థలం 55 నుంచి 57 శాతం వరకు ఉంటుంది. షాపింగ్ ఏరియా కోసం 12 నుంచి 13 శాతం వరకు కేటాయిస్తారు. సర్విస్ అపార్టుమెంట్స్ కోసం 8 శాతం ప్రదేశాన్ని వినియోగిస్తారు. ఈ టవర్లను వేటి కోసం, ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.
వాణిజ్య, కార్యాలయ, అవసరాల కోసమే కాకుడా ప్రజలు నివసించేందుకు వీలుగా అందుబాటు ధరలో అపార్టుమెంట్లుగా వీటి నిర్మాణం చేపట్టాలని చెప్పారు. మరికొంత అధ్యయనం చేసి 3 వారాలలో సమగ్ర ఆకృతులు, నివేదికతో రావాలని ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థకు సూచించారు.