రాజధాని పరిధిలో ఒక్కొక్కటిగా కంపెనీల రాక ప్రారంభమైంది. ఐటీ సంస్థలతో పాటు పారిశ్రామిక క్లస్టర్లు సైతం ఏర్పాటు చేస్తుండడంతో యువతకు ఉపాధి అవకాశాలు చేరువవుతున్నాయి. కృష్ణా, గుంటూరుల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు గత ఏడాది కాలంలో 35 వరకూ ప్రారంభమయ్యాయి. వీటిలో 2300కు పైగా కొలువులు స్థానిక యువతకు లభించాయి. మరో ఆరు నెలల్లో గన్నవరంలోని ఐటీ పార్కులో రెండో టవర్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీనిలో మరో 25 కంపెనీల వరకూ రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మేధాటవర్స్‌లో 12 కంపెనీలు ఉండగా.. మరికొన్ని కంపెనీలకు త్వరలో స్థలం కేటాయించనున్నారు.
గుంటూరు పరిధిలోని మంగళగిరిలోనూ ప్రస్తుతం ఓ ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. దీనిలో 50వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి వచ్చింది. మూడు అంతస్థుల్లో పైకేర్ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసింది. మరో అంతస్తులో ఇతర కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ ఐటీ టవర్‌లో మొత్తం 400మంది వరకూ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడే మరికొన్ని కూడా ఏర్పాటు కానున్నాయి.. మంగళగిరి పరిధిలోనూ మరో 30 ఐటీ కంపెనీల వరకూ ఏర్పాటు చేసేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మంగళగిరిలో హెల్త్‌క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, బీమా కంపెనీల ప్రొసీజర్స్ వంటి కంపెనీలు దీనిలో రానున్నాయి.
గన్నవరం ఐటీపార్క్‌లో మేధాటవర్స్‌కు వెనుకవైపు రెండో ఐటీ టవర్ నిర్మాణం ప్రారంభమైంది. దీనిలో 4.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం స్థలం అందుబాటులోకి రానుంది. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తిచేసి ఐటీ కంపెనీలకు కేటాయించనున్నారు. 25 సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఎల్ సంస్థకు గన్నవరంలో 17 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ భవనాల నిర్మాణానికి పరిశీలన పూర్తయింది. 2018 జనవరి నుంచి ప్రారంభించి.. 2019 జనవరిలోగా భవనాల నిర్మాణం పూర్తి చేయనున్నారు. గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెంలో ఉన్న 81 ఎకరాల స్థలంలో పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 75 సంస్థలకు స్థలాలను కేటాయించారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును వంద ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ 936 యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే 33యూనిట్లతో ఫుడ్‌పార్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు.