రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని అఖిలపక్ష పోరాట సమితి నిర్ణయించింది. ఆందోళనలు, నిరసనలు తారాస్థాయిలో జరుగుతు న్నప్పటికీ జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించలేకపోతున్నా మన్న అభిప్రాయాలు రాజధాని రైతాంగంలో వ్యక్తమవుతున్నాయి. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా దశలవారీ ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగా ఈ నెల 31న అఖిలపక్ష బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్ళనుంది. తొలుత వారంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి పరిస్తితి వివరించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు జాతీయ స్థాయిలో స్పషమైన ప్రకటన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ లభించటం కష్టమయినందున పార్లమంటు సెంట్రల్ హాల్ వద్ద నేరుగా కలవాలని భావిస్తున్నారు.
అనంతరం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల నాయకులను కలవాలని నిర్ణయించారు. అదే విధంగా జాతీయ మీడియా దృష్టికి అమరావతి సమస్యను తీసుకెళ్లాలని జేఏసీ నాయకులు తలపోస్తున్నారు. దానిలో భాగంగా ఢిల్లీ కేంద్రంగా పనిచేసే మీడియా సంస్థల అధినేతలను కలిసి అమరావతిలో చోటు చేసుకున్న పరిణామాలపై నివేదిక రూపంలో తెలియజేసి తమ న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతు ఇచ్చేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి రెండవ వారంలో రెండవ దశ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. రెండవ దశలో దాదాపు వందమంది మహిళా రైతులను ఢిల్లీకి తీసుకెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. కనీసం 3 లేదా 4రోజుల పాటు ధర్నా చేపట్టాలని జేఏసీ తలపోస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగు తున్నందున అవి ముగిసిన అనంతరం ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ ధర్నాకు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీతో పాటు వామపక్ష పార్టీల అగ్రనేతలు వచ్చి సంఘీభావం తెలిపే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇక మరో పక్క, అమరావతి పరిరక్షణ సమితి గౌరవ సలహాదారుడిగా డాక్టర్ జి.వి.ఆర్.శాస్త్రి నియమితులయ్యారు. రాజధాని ఉద్యమంలో తమకు సలహాలను అందజేయాలని జేఏసీ చేసిన ప్రతిపాదనకు శాస్త్రి అంగీకారం తెలిపారు. ఇక నుంచి చేపట్టే పలు కార్యక్రమాలను ఆయన రూపకల్పన చేస్తారని జేఏసీ ప్రకటించింది. శాస్త్రి న్యూఢిల్లీ ఐఐటీ నుంచి పీహెచ్ డీ పొందారు. ప్రస్తుతం ఆయన సీఐడీసీ (కోస్టల్ ఇండియా డెవలప్ మెంట్ కౌన్సిల్) చైర్మన్ గా వ్యవహ రిస్తున్నారు. ఈయనకు బీజేపీ అధిష్టానంతో, దగ్గర సంబంధాలు ఉన్నాయి.