అమరావతిలో మరొక 19 సంస్థలకు మొత్తం 51.92 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల బృందం సిఫార్సుతోపాటు సీఆర్డీయే కమిషనర్ పంపిన ప్రతిపాదనల ఆధారంగా వివిధ సంస్థలు, విద్యాసంస్థలకు ఈ భూమిని కేటాయించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు 3.50 ఎకరాలను, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)కు 0.80 ఎకరాలను, భారత వాతావరణ శాఖకు ఎకరం, విదేశ్ భవన్ నిర్మాణార్థం విదేశీ వ్యవహారాల శాఖకు 2 ఎకరాలను (ఎకరం రూ.కోటి చొప్పున) కేటాయించారు. ఆర్‌అండ్‌డీ కేంద్రం, టెక్ కన్వెన్షన్ సెంటర్ కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి 2 ఎకరాలు, రాష్ట్ర పోలీస్ శాఖ ఇంటెలిజెంట్ వింగ్‌కు 2,000 చదరపు గజాలు, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు 2 ఎకరాలు, లింగాయపాలెంలో ఏపీ ట్రాన్స్‌కో 2201132- 33 కేవీ జీఐఎస్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 2.59 ఎకరాలను నామమాత్ర ధరకు ఇచ్చారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 1.57 ఎకరాలను, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1.55 ఎకరాలను, ఇండియన్ బ్యాంక్‌కు 1.50 ఎకరాలను ఎకరం రూ.4 కోట్లకు కేటాయించారు. సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్‌కు 3 ఎకరాలు, రూప్‌టెక్ ఎడ్యుకేషనల్ ఇండియాకు 4 ఎకరాలు, ఎన్‌లెర్న్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3 ఎకరాలు, సెయింట్ లారెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ట్రస్ట్‌కు 4 ఎకరాలు, సద్భావన నాలెడ్జ్ ఫౌండేషన్‌కు 4 ఎకరాలు, ఆనందీలాల్ గణేష్ పొదార్ సొసైటీకి 3 ఎకరాలు, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి 8 ఎకరాలు, గ్లోబల్ స్కూల్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 4 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల లెక్కన కేటాయించారు.
సంస్థల పేర్లు మార్పు... కాగా, గతంలో అమరావతిలో భూములను కేటాయించిన కొన్ని సంస్థల పేర్లలో మార్పులు చోటుచేసుకున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది. రాజధానిలో 10 ఎకరాలను పొందిన బ్రహ్మ కుమారీస్ సొసైటీ పేరును ఇకపై ‘బ్రహ్మ కుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ’గానూ, 50 ఎకరాలను పొందిన గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరును ‘గ్జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్’గానూ మార్చినట్లు తెలిపింది.