ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం కంటే, ఖర్చులు ఎక్కువ. అందుకే అప్పులు తెచ్చి, భూములు అమ్మి నెట్టుకుని వస్తున్నారు. గత 18 నెలల కాలంలో లక్షా 20 వేల కోట్లు వరకు అప్పు చేసారు. అంటే గత ప్రభుత్వ హయంలో 5 ఏళ్ళలో చేసినంత అప్పు. పోనీ దీని నుంచి ఆదాయం వచ్చే పనులు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇలా మొత్తానికి ఏదో రకంగా అప్పులు చేసి నెట్టుకుని వస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గిస్తున్నారా అంటే, ఎక్కడ చూసినా భారీ ఖర్చులే. ఇంకా చెప్పాలి అంటే అనవసరపు ఖర్చులు అని కూడా చెప్పవచ్చు. కానీ అది ప్రభుత్వానికి అవసరం ఏమో. ఇక విషయానికి వస్తే, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి రైతులు వివిధ కేసులు హైకోర్టులో వేసారు. ఈ కేసులు కోసం ప్రభుత్వం, బడా బడా లాయర్లను తీసుకుని వస్తుంది. అందులో ఢిల్లీలో ఉండే టాప్ లాయర్లు కూడా ఉన్నారు. గట్టిగా గంట వాదిస్తే, లక్షలు లక్షలు ఇవ్వాల్సిందే. అలాంటి లాయర్లను ప్రభుత్వం తన వాదనలు విపించటానికి పెట్టుకుంది. అయితే వీళ్ళు ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది పక్కన పెడితే, ప్రభుత్వం వారికి ఇచ్చిన మొదటి విడత ఫీజు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. అప్పుడెప్పుడో ఒక లాయర్ కోసం 5 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వివిధ పెద్ద పెద్ద లాయర్లకు డబ్బులు విడుదల చేసారు.
నిన్న ప్రభుత్వం అమరావతి కేసులు విషయంలో, అటు సుప్రీం కోర్టులో, ఇటు హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు కింద రూ.2.3 కోట్లు వరకు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఇందులో న్యాయవాదులు పరంగా వారికి చెల్లించిన ఫీజు వివరాలు చూస్తే, ప్రముఖ లాయర్ హరీష్ సాల్వేకి రూ.45 లక్షలు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక మరో ప్రముఖ లాయర్ రాకేష్ ద్వివేదికి రూ.73 లక్షలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది కూడా అయినా కపిల్ సిబల్‌కి రూ.25 లక్షలు విడుదల చేసారు. నిన్న నంద్యాల కేసులో టిడిపి లాయర్ పై నిందలు వేసారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ లాయర్ ని ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తే ? సరే మనకు ఎందుకులే. ఇక ఆత్మారాం నాదకర్ణికి రూ.17.60 లక్షలు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌కి రూ.18.10 లక్షలు, నిరంజన్‌రెడ్డికి రూ.22 లక్షలు ఇలా విడుదల చేస్తూ, అమరావతి కేసు విషయంలో ప్రభుత్వ వాదనను సమర్ధవంతంగా వినిపిస్తున్నారు. అయితే అమరావతిని మూడు ముక్కలు చేయటమే ఒక తెలివి తక్కువ నిర్ణయం అనుకుంటే, ఆ నిర్ణయం సమర్ధిస్తూ మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టటం ఏమిటి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.