ఇంటర్నల్ కనెక్టివిటీలో అమరావతి కొత్త హంగులు అద్దుకుంటోంది... రాజధాని నాల్గు దిక్కులనూ కలుపుతూ ఎనిమిది రోడ్లు రాబోతున్నాయ్. సీడ్ యాక్సిస్ మెగా రోడ్ తో ఇవి లింక్ అవుతాయ్. అంటే ఎటువెళ్లినా అమరావతే… అవును. ఇప్పటికే దాదాపు 85% మేర సీడ్ యాక్సిస్ సిక్స్ లేన్ రహదారి రూపు దిద్దుకుంటోంది... ఈలోగా తూర్పు పడమరల వైపు నాల్గు రోడ్లు…ఉత్తర దక్షిణాల్లో మరో నాల్గు రోడ్లు కలిపి మొత్తం ఎనిమిది రహదారులు అమరావతిని అందరికీ చేరువ చేయబోతున్నాయ్. రాజధానిలో ప్రతి గ్రామాన్నీ కలుపుతూ, నాల్గు వైపుల నుంచి వచ్చేవారికి సౌకర్యంగా ఉండేలా వీటి నిర్మాణంజరుగుతుంది...
‘‘హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూశాను. రాజధాని పనులు జోరుగా సాగుతున్నాయి. రహదారులు బాగా వేస్తున్నారు’’ అని మొన్న ఈ మధ్య అమరావతి వచ్చిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ప్రశంసించారు. అదే రేంజ్ లో, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం జెట్ స్పీడులో సాగుతోంది. హైవేలను మించిన వెడల్పుతో తయారవుతున్న విశాలమైన రహదారులను చూసి స్థానికులు అబ్బురపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఎటువైపు వెళ్లినా... రోడ్ రోలర్లు, టిప్పర్లు, పొక్లయిన్లతో సాగుతున్న రహదారి నిర్మాణ పనులే కనిపిస్తాయి. రూ.9వేల కోట్లకుపైగా వ్యయంతో 36 రహదారులను నిర్మిస్తున్నారు. అవసరమైనప్పుడు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రిళ్లు సైతం పనులు చేస్తున్నారు. మొదటి దశలో చేపట్టిన 7 రోడ్ల పనులు మరో నెలలో పూర్తికానున్నాయి. మొత్తం రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను పరుగులు తీయిస్తున్నారు.
ముఖ్యమైన ప్రాంతాలన్నింటినీ కలిపేలా అమరావతిలో మొత్తం 593 కిలోమీటర్ల నిడివితో రహదారులను నిర్మిస్తున్నారు. వీటిలో అతి ముఖ్యమైన 316 కిలోమీటర్ల పొడవున్న 36 రహదార్ల నిర్మాణం కోసం రూ.9162 కోట్లను వెచ్చిస్తున్నారు. మొత్తం 15 ప్యాకేజీల్లో చేపట్టిన పనులను పదికిపైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఎటు చూసినా రహదారి పనులు సాగుతున్నాయి. వందల సంఖ్యలో యంత్రాలు, వాహనాలు... తిరుగుతున్నాయి. రాజధానిలో అత్యంత ప్రధానమైనది... ‘సీడ్ యాక్సిస్ రోడ్’. ఇది (విజయవాడలో కనకదుర్గమ్మ వారధి దాటిన తర్వాత) 16వ నెంబరు జాతీయ రహదారి నుంచి అమరావతి నగరంలోకి నేరుగా తీసుకెళ్లే ఎక్స్‌ప్రెస్ హైవే! మొత్తం 21.26 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ దారిని రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో 18.27 కిలోమీటర్ల దారిలో 85 శాతం పనులు పూర్తయ్యాయి. దీనికోసం రూ.230 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అటూ ఇటూ రహదారి మధ్యలో భారీగా ఖాళీ స్థలాన్ని వదిలారు.భవిష్యత్తులో రోడ్డును వెడల్పు చేయాల్సి వస్తే... కొత్తగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా, మధ్యలోని స్థలాన్నే ఉపయోగించుకునేలా ప్రణాళిక రచించారు.
ఇక సీడ్ యాక్సెస్ రోడ్‌కు ఇరువైపులా మొక్కలు నాటారు. భవిష్యత్తులో ఇవి భారీ వృక్షాలై... చల్లని నీడను అందించనున్నాయి. ఒకసారి రోడ్లు వేయడం... ఆ తర్వాత పైప్లైన్లు, ఇతర పనులకోసం వాటిని తవ్వేయడం ప్రతిచోటా జరిగేదే! రాజధాని రోడ్ల విషయంలో ఇలాంటివి జరగవు. సుమారు 15 ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రహదారుల వెంట గ్యాస్, తాగునీరు, ఎలక్ట్రికల్, కేబుల్ వంటి పైపులైన్లను కూడా ఒకేసారి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆయా అవసరాల కోసం మళ్లీ మళ్లీ తవ్వాల్సిన అవసరం ఉండదు.