మన అమరావతి - మన రాజధాని అంటూ, అమరావతి అనే మాటకు ఎమోషనల్ గా ఆంధ్రుడు కనెక్ట్ అయిపోయాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీ అవుతుందని కలలు కన్నాడు. పనులు కూడా అలాగే సాగాయి. ఎటుచూసినా యంత్రధ్వనులు.. మహాసౌధాలను నిలబెట్టడానికి చీమలబారుల్లా కదులుతున్న శ్రామికజీవులు.. నేలమాళిగల్లోంచి కలల రాజధానిని ఆవిష్కరిస్తున్న ఇంజనీరింగ్ పనితనం.. పరుగులు తీస్తున్న ప్రణాళికలు.. ఇలా రాజధాని అమరావతిలో సందడి చేసిన జాడలు ఇప్పుడు కనిపించడం లేదు. రాజధాని విషయంలో కొత్త ప్రభుత్వం వైఖరి ప్రభావం అడుగడుగునా కనిపిస్తోంది. పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కార్మికులు స్వస్థలాలకు పోతున్నారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం కళతప్పింది. గ్రీవెన్సులు, రాజధాని గ్రామాలలో కల్పించాల్సిన వసతులపై నిత్యం సమీక్షలుండేవి. ఇప్పుడా కోలాహలమే కనిపించడం లేదు.
రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ నిర్మాణాలు నిధుల కొరత కారణంగా కొంతకాలం నిలిపివేసే పరిస్థితి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. అమరావతిలో వివిధ నిర్మాణాల కొనసాగింపు పై జగన్ సమీక్ష తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కొన్ని పనులను కొంతకాలం నిలిపివేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని అమరావతిని ఐదు ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక రూపొందించడం తెలిసిందే. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, రహదారులు, ఐకానిక్ వంతెన డిజైన్లు ఇప్పటికే ఖరారు చేయగా, అనేక పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటి వరకూ 1500 కోట్ల రూపాయలే కేటాయించగా, మరో 1000 కోట్లు మంజారు చేసినా, ఇంకా విడుదల కాలేదు. రాజధాని పరిధిలో 39,875 కోట్ల రూపాయల మేర పనులు జరుగుతుండగా, మరో 4,214 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి. మరో 7600 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాల పనులు కొద్ది రోజులు నిలిపివేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వివిధ సందర్భాల్లో జగన్, అమరావతి పై చూపించిన అనాసక్తి ఇప్పుడు తెర మీదకు వస్తుంది. చూద్దాం చంద్రబాబు లేని అమరావతి, ఏమవుతుందో..