కాస్త ఈదురుగాలులు వీచినా లేక ఇతరత్రా ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా జనావాసాల్లో మొదట ప్రభావితమయ్యేది విద్యుత్తు వ్యవస్థేనన్న విషయం మనందరికీ అనుభవమే. కరెంట్ తీగలు తెగిపడడం, స్తంభాలు విరిగిపోవడం, వాటి కారణంగా విద్యుదాఘాతాలు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు చోటు చేసుకోవడమే కాకుండా వాటిని సరి చేసి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చాలా సమయం పట్టడమూ తెలిసిందే. అయితే... ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమవు తున్న అమరావతి నగరంలో మాత్రం పైన పేర్కొన్న ఇబ్బందులు, ప్రమాదాలకు ఏమాత్రం ఆస్కారం ఉండబోదు. విద్యుత్తు కేబుళ్లన్నీ భూగర్భంలో, టన్నెలింగ్ సిస్టంలో ఉంటాయి! రాజధాని రహదారుల వెంబడి తవ్వుతున్న భారీ గోతుల్లో ఏర్పాటు చేయబోయే డక్ట్‌లలో ఈ కేబుళ్లను ఉంచుతారు.
అభివృద్ధి చెందిన దేశాలు, నగరాల్లో మాత్రమే కనిపించే ఇంతటి అత్యధునాతన అండర్‌గ్రౌండ్ టన్నెల్, హెచ్.డి.పి.ఇ. డక్ట్‌లలో కేవలం విద్యుత్తు తీగలు మాత్రమే కాకుండా ఇతర వ్యవస్థలైన నీరు, గ్యాస్, సీవరేజ్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ సిస్టంలకు సంబంధించిన కేబుళ్లు, పైపులను అమర్చుతారు. ఇవి ఎంత భారీగా ఉంటాయంటే పూర్తయిన తర్వాత వీటిల్లోకి సంబంధిత సిబ్బంది సులభంగా ప్రవేశించడమే కాకుండా నడవగలుగుతారు. తద్వారా భూగర్భంలోని ఏ వ్యవస్థలో నైనా, ఎక్క డైనా, ఏమైనా అంతరాయాలు సంభవిస్తే తక్షణమే ఆ ప్రదేశాన్ని గుర్తించడంతోపాటు వెంటనే అక్కడికి చేరుకుని, దానిని సరి చేయగలుగుతారు.
అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో రాజధానిలో నిర్మితమవుతున్న వివిధ కీలక రహదారుల వెంబడి ప్రస్తుతం ఈ డక్ట్‌లకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అంటే.. అమరావతిలో ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగా రోడ్ల వెంబడి, పైకి కనిపించేటటువంటి ఎలక్ట్రిక్ స్తంభాలుగానీ, పైపులైన్లుగానీ, మురుగుకాల్వలు ఇత్యాదివి గానీ కనిపించవన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే వివిధ కేబుళ్లు, పైపులైన్ల పేరిట పదేపదే రోడ్లను తవ్వాల్సిన అగత్యంగానీ, ఆ రూపంలో ప్రజలకు ఎదురయ్యే అవస్థలుగానీ ఉండవు. భవిష్యత్తులో ఎల్పీఎస్ జోన్లతో సహా రాజధాని మొత్తాన్నీ కవర్ చేసేలా ఈ భూగర్భ సొరంగాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి మాత్రం ట్రంక్ రోడ్ల వెంబడి 80 కిలోమీటర్ల పొడవున ఆర్.సి.సి. భూగర్భ సొరంగాలను, 230 కి.మీ. పొడవైన హెచ్.డి.పి.ఇ. డక్ట్‌లను నిర్మిస్తున్నారు. తర్వాత్తర్వాత ఎల్పీఎస్ జోన్లలోనూ సుమారు 1,000 కిలోమీటర్ల పొడవైన డక్ట్‌లను ఆయా జోన్లలోని రోడ్ల పక్కన నిర్మిస్తారు.