తమ ప్రాణ సమానమైన భూములు, విభజన జరిగి రోడ్డున పడ్డ రాష్ట్రానికి ఇచ్చిన అమరావతి రైతులు, గత రెండేళ్లుగా రోడ్డున పడి రోదిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి అమరావతికి మద్దతు తెలపటంతో, భూములు ఇచ్చిన రైతులు, ప్రభుత్వం మారగానే, మాటలు మార్చే వ్యక్తుల చేతిలో మోసపోయారు. అమరావతిని మూడు ముక్కలు చేసిన పాలకుల తీరుకు నిరసనగా, గత 450 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావటంతో, మహిళా రైతులు, కనకదుర్గమ్మ దర్శనం కోసం, అమరావతి నుంచి కాలి నడకన, విజయవాడ బయలుదేరారు. అయితే ఇందులో ఏమి తప్పు కనిపించిందో, ఎవరు అడ్డుకోమని చెప్పారో కానీ, శాంతియుతంగా మొక్కులు చెల్లించుకోవటానికి వెళ్తున్న మహిళలను, ప్రకాశం బ్యారేజి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కాలి నడకన గుడికి వెళ్ళటం కూడా తప్పేనా ? మేము చేసిన పాపం ఏమిటి అంటూ, మహిళా రైతులు ప్రకాశం బ్యారేజీ మీదే కూర్చుని నిరసన తెలిపారు. అంతే ఒక్కసారిగా పోలీసులు వారి మీద పడి, వారిని ఈడ్చి పడేసారు. ఈడ్చుకుని వ్యానుల్లో ఎక్కించుకుని, తాడేపల్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా, ఇలా చేయటం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. ఒక్కసారిగా ప్రజలు అందరూ బయటకు వచ్చి నిరసన తెలిపారు. సేవ్ అమరావతి నినాదాలతో హోరెత్తించారు. సచివాలయం వద్దకు కవాతుగా వెళ్లి, తమకు జరిగిన అన్యాయాన్ని తెలియ చేస్తామని బయలుదేరారు. అయితే దారిలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా మళ్ళీ పోలీసులు తమ జులం ప్రదర్శించారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో రైతులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మహిళా దినోత్సవం రోజున, తమకు ఇది జగన్ ఇచ్చిన కానుక అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళా హోం మంత్రి, ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న చోటే, ఇలా మాకు సన్మానాలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ, తమకు మద్దతుగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఏసి రూముల్లో కూర్చుని, గొప్పగా గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి, మాకు జరుగుతున్న అన్యాయం పై ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తున్నారు.