తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల, ఈ మధ్య ఆక్టివ్ అయ్యారు. తెలంగాణాలో ఉద్యోగాల సమస్య పై, ఆమె దీక్ష కూడా చేసారు. అయితే దీక్ష సందర్భంగా, ఆమె జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాని ఉద్దేశించి, మీరు మాకు ఎలాగూ కవరేజ్ ఇవ్వరు, పక్కకి తప్పుకోండి అంటూ, బహిరంగంగా స్టేజి పై, పక్కన విజయమ్మ ఉండగానే ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. షర్మిల బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయటంతో, జగన్ మోహన్ రెడ్డికి, ఆమెకు మధ్య గ్యాప్ వచ్చింది నిజమే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు షర్మిలకు, అమరావతి మహిళలు లేఖ రాసారు. తెలంగాణాలో దీక్ష చేసిన మీకు, ఆ సందర్భంగా గాయాలు కావటం, సాటి మహిళలుగా మాకు కూడా ఇబ్బంది అనిపించింది అంటూ, వాళ్ళు షర్మిలకు రాసిన లేఖలో తెలిపారు. మీరు తెలంగాణాలో చేస్తున్న పోరాటంలో ఎంత న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారో, అలాగే మేము అమరావతి కోసం 491 రోజులుగా అదే విధంగా న్యాయం కోసం, ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. మిమ్మల్ని తెలంగాణా పోలీసులు కేవలం, ఒక్క రోజు మాత్రమే అడ్డుకుని అవమానించి, గాయపరిచారని, మమ్మల్ని మాత్రం , ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి, ఏడాది కాలంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారని అన్నారు.
అలాగే తెలంగాణాలో మీరు చేస్తున్న పోరాటానికి, అక్కడ మీ వదిన గారు భారతి గారి నిర్వహణలో ఉన్న సాక్షి ఏ విధంగా కవరేజ్ ఇవ్వటం లేదో, ఇక్కడ కూడా మాకు అమరావతి కోసం చేస్తున్న పోరాటానికి కూడా, ఇక్కడ సాక్షి మీడియా చూపించటం లేదని, మహిళలు అని కూడా చూడకుండా, మాకు కనీసం సాక్షిలో కవరేజ్ ఇవ్వక పోగా, వ్యతిరేకంగా కధనాలు రాస్తున్నారని షర్మిలకు తెలిపారు. ఈ విషయంలో, మీరు, మేము కూడా సాక్షి బాధితులమే అని తెలిపారు. అలాగే మీ పై తెలంగాణా ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై విజయమ్మ గారు ఆక్షేపించారు. అది వాస్తవం, తెలంగాణా ప్రభుత్వం తప్పు చేసింది, అలాగే ఇక్కడ మా పైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దమనకాండను కూడా , విజయమ్మ గారి ఖండించాలని కోరారు. అప్పుడు తెలంగాణాలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత వస్తుందని అన్నారు. మీరు తెలంగాణా కోడలిగా అక్కడ ఎలా పోరాటం చేస్తున్నారో, మేము కూడా ఇక్కడ ఆంధ్రా బిడ్డలుగా చేస్తున్నాం అని, మా బాధలు వినటానికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నామని, షర్మిలని కోరారు.