రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ, నిన్న మన రాష్ట్రంలో పర్యటించి, వెలగపూడి సచివాలయంలో, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ సందర్శించిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంలో, ముకేష్ అంబానీ ఒక ఆసక్తికర విషయం చెప్పారు.... ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని వెళ్లి రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తే తనకు ఆసక్తి కలిగిందని, ఇప్పుడు సందర్శించే అవకాశం వచ్చిందని, పారదర్శక పరిపాలన, జవాబుదారీతనంతో ప్రభుత్వాలు వ్యవహరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ విధానం అపూర్వమన్నారు. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసిన ఆరోజుల నుంచీ తనకు తెలుసని ముకేశ్ అంబానీ చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ ‘ఈ వినూత్న ప్రయోగాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. స్ఫూర్తిదాయకంగానూ ఉంది.మీలాంటి సమర్ధుడైన నాయకుడు మరింత పెద్ద హోదాలో ఉంటే అద్భుత ఫలితాలు ఒనగూరతాయి’ అని ముకేశ్ అంబానీ సీఎంను ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ-ఆఫీసు విధానం దేశమంతా అమలులోకి తేవాల్సి ఉందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం దేశంమంతా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మేధోపరమైన హక్కులను మీరు పొంది మీ బృందమే అన్ని రాష్ట్రాలలో ఈ విధానం అవలంబించేందుకు శిక్షణనిచ్చి మార్గదర్శనం చేయవచ్చు’ అని ముకేశ్ అంబానీ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు...
పరిపాలనలో ఈ నవ్య ప్రయోగం, నవ్య విధానం తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచంలో సుపరిపాలనకు ఎస్టోనియాను ఒక నమూనాగా భావిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను చూశాక అధ్యయనానికి ఎస్టోనియా సీఈఓ, ఆయన బృందమే ఇక్కడికి రావాలి’ అని ముకేశ్ అంబానీ కితాబునిచ్చారు. ‘ ముప్ఫయ్ విభాగాలను ఏకీకృతం చేసి మీరు సాధించిన అభివృద్ధి చూశాక సాంకేతికత వినియోగంలో ఇక మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’ అని ఆయన చెప్పారు. ఇప్పడు ‘ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ’ ద్వారా ఎన్నో అవకాశాలున్నాయని ముకేశ్ అంబానీ అన్నారు.