తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయపరమైన విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.రాజకీయపరమైన ప్రతి అంశానికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ముడిపెడుతూ వైఎస్ జగన్‌పై టిడిపి విమర్శలు గుప్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా చంద్రబాబును సమర్థిస్తోంది వైఎస్ఆర్ సీపీ. ఆ విషయంలో చంద్రబాబు చేస్తోన్న కృషిని మెచ్చుకుంటోంది. ఆయన చేస్తోన్న పోరాటాన్ని స్వాగతిస్తోంది. ఆయనను అభినందిస్తోంది. అదే- వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారం.
ఈ విషయంలో చంద్రబాబు చేస్తోన్న పోరాటాన్ని అభినందనీయమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెబుతున్నారు. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ చంద్రబాబు చేస్తోన్న డిమాండ్‌లో కొంత నిజాయితీ ఉందని, నిబద్ధత కనిపిస్తోందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఒక్కో నియోజకవర్గంలో అయిదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, అందులో నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో తేడా వస్తే ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోందని, తేడా వస్తే- అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.
జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ విషయంపై చంద్రబాబు తన వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకోకూడదని, చిత్తశుద్ధితో పోరాటం చేయాలని అన్నారు. అవసరమైతే దీనిపై తాము కూడా చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని అంబటి హితబోధ చేశారు. సుప్రీంకోర్టులో ఒక్కో నియోజకవర్గంలో అయిదు వీవీ ప్యాట్లను లెక్కించడానికి అవకాశం ఇచ్చిందని, తేడా వస్తే మొత్తం లెక్కించాలని అడగటంలో ధర్మం ఉందని అంబటి రాంబాబు చెప్పారు. అయిదు ఈవీఎంలల్లో తేడాలంటూ వస్తే, అన్ని ఈవీఎంలనూ లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం సబబేనని ఆయన అన్నారు.