విభజన సమస్యలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల బృందం కీలక భేటీ ముగిసింది. ఈ సమావేశానికి ఆఖరి నిమిషంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరుకాలేకపోయారు. అరుణ్ జైట్లీ కార్యాలయంలో సుధీర్ఘ చర్చ జరిగింది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వేజోన్‌తో పాటు పలు విషయాలను యనమల బృందం.. జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్నాయుడు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు, మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రూ. 16వేల కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సిందేనని అడిగామని.. అయితే రెవెన్యూ లోటుపై కేంద్రం లెక్కలతో మేం ఏకీభవించడం లేదన్నారు. "పరిశ్రమలకు రాయితీలే ముఖ్యం. వీటిపై అందరితో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడామని, రాష్ట్ర పరిస్థితులను స్పష్టంగా వివరించామని చెప్పారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాత్రం, ఈ సమవేశంలో చర్చించిన విషయాల పై మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని చెప్పారు..
ఇటీవల సీఎం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి చర్చలకు రావాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యనమల బృందం ఢిల్లీకి వెళ్ళింది. సోమవారం సాయంత్రం జైట్లీ, అమిత్‌షాతో యనమల బృందం చర్చలు జరుపుతారని చెప్పినా, చివరి నిమిషంలో అమిత్ షా రాలేదు, జైట్లీ సమక్షంలోనే చర్చలు జరిగాయి. విభజన హామీలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని, ఈ నెల 5న చర్చిద్దామని సీఎం చంద్రబాబుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ ద్వారా చెప్పారు. అమిత్‌షా ఫోన్‌తో స్పందించిన చంద్రబాబు... కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులను చర్చలకు పంపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదిలేదని అమిత్‌షాకు చంద్రబాబు తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయం.. హోదా విషయంలో పోరాటాన్ని ఆపేది లేదని, పార్లమెంట్లో తప్పనిసరిగా పట్టుపడతామని ఆ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే...