పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ రథయాత్రల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కేవలం బహిరంగ సభల నిర్వహణకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రథయాత్రలకు సవరించిన ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం ముఖ్యమంత్రి మమత బెనర్జీకి గొప్ప విజయంగా చెప్పవచ్చు. బీజేపీ రథయాత్రల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తూ, మమత ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే.
ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలను పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ యాత్రలను ప్రారంభించవలసి ఉంది. కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ యాత్రలకు అనుమతి ఇచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అపీలు చేసింది. డివిజన్ బెంచ్ ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ, బీజేపీ రథయాత్రలకు అనుమతిని నిరాకరించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ పేరుతో పశ్చిమబెంగాల్‌లోని 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రథయాత్రలు నిర్వహించాలని బీజేపీ భావించింది. మమత బెనర్జీని రాజకీయంగా ఇబ్బంది పెట్టటం కోసం, ఈ రధయాత్ర ద్వారా, అమిత్ షా ఎదో స్కెచ్ వేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి బధ్రతల పై ఈ రధయాత్ర ప్రభావం ఉంటుందని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం భావించింది.
సమస్యలు సృష్టిస్తుందన్న అనుమానంతో తృణమూల్ కాంగ్రెస్ భాజపా రథయాత్రను అడ్డుకుంటుదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. డిసెంబరు 28 నుంచి 31 మధ్యలో ఈ రథయాత్రను నిర్వహించాల్సి ఉండగా, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి షెడ్యూల్ మార్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజవర్గాల్లో ప్రచారం నిర్వహించాలన్న భాజపా ప్రణాళికకు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో అడ్డంకి ఏర్పడింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజనల్ బెంచ్ పక్కన పెట్టింది. ఆ నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ భాజపా సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీం కూడా కుదరదు అని చెప్పింది.