పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానం జరిగింది. జనం లేక అమిత్‌షా సభ వెలవెలబోయింది. భాజపా చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి అమిత్‌షా పలాస వచ్చారు. అమిత్‌షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది భాజపా రాష్ట్ర కార్యవర్గం. వేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు కూడా ఏర్పాటు చేసారు. అయితే ప్రజలు మాత్రం అమిత్ షా ను తిరస్కరించారు. జనం లేక కుర్చీలను ముందే సర్దేసారు బీజేపీ కార్యకర్తలు. డబ్బులు ఇస్తాం అన్నా ప్రజలు రాని పరిస్థితి. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో, పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్నారు అమిత్‌షా. అయితే అక్కడి నేతలు మా పరువు పోతుంది, ఇలా చెయ్యకండి అని బ్రతిమిలాడటంతో అమిత్ షా కురించారు.
ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథం పై నుంచే ప్రసంగించారు అమిత్‌షా. ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదికను చూసి కన్నాకు చురకలు అంటించారు. ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసారు భాజపా నాయకులు. మరో పక్క, అమిత్‌షా రాకపై తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆధ్వర్యంలో కార్యకర్తలు కాశీబుగ్గ పాతబస్టాండ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అమిత్‌షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నేతలను అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పీఎస్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే శివాజీ, గౌతు శిరీష, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లోనే బైఠాయించారు.
అయితే ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, రాష్ట్రానికి 5 లక్షల కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. అవి చంద్రబాబు జేబులోకి వెళ్ళాయంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల్లో సింహభాగం మొదటి ఐదేళ్లలోనే పూర్తిచేశామని.. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్.. విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థలేవీ ఇంతకుముందు ఏపీలో లేవని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్, విశాఖలో ఎన్ఐపీఈఆర్ నెలకొల్పామని.. పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని కూడా ఏపీకి కేటాయించామని అమిత్‌షా చెప్పారు.