మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల పక్కన అమిత్ షా కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చోవడం కనిపించింది. పక్కనే అద్వానీ కూర్చుంటే, ఆయనకు కాలు తగిలెంత దూరంలో, కాలు మీద కాలు వేసుకుని, అద్వానీని అవమానించారు. ఈ పరిణామం పై నెటిజెన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా, ఈ విషయం చూపించటంతో, అమిత్ షా తీరు పై విమర్శలు వస్తున్నాయి.
అందరూ విషణ్ణ వదనాలతో ఉన్న వేళ అమిత్ షా అలా కూర్చోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ మాజీ ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలను కోట్లాదిమంది వీక్షిస్తున్నారన్న విషయాన్ని మరిచి ఇలా ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీస్తున్నారు. భూటాన్ రాజు సహా వివిధ దేశాల మంత్రుల ఎదుట ఇలా వ్యవహరించి వాజ్‌పేయిని అవమానించారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా, అద్వానీని, వేదిక పైనే, ప్రధాని నరేంద్ర మోడీ అవమానపరిచిన సంగతి, దేశం మొత్తం చూసి నివ్వెరపోయింది. ఇప్పుడు, ఇలా అందరి ముందే, అమిత్ షా ప్రవర్తించిన తీరు, అభ్యంతరకరం.
"రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భాజపా వ్యవస్థాపకుడు, దేశంలోనే గొప్ప రాజనీతిజ్ఞుడు ఎల్‌కే అద్వానీ, భూటాన్ విదేశాంగ మంత్రి వీరంతా ఎలా కూర్చున్నారు? వారి సరసన అమిత్ షా ఎలా కూర్చున్నారు? తన పాదం అద్వానీని తాకినంత సమీపంలో పెట్టి, గంటల తరబడి అదే భంగిమలో కూర్చున్నాడు. వేలు చూపి మాట్లాడటం ఎంత అమర్యాదో, కాలు చూపి కూర్చోవటం అంటే అమర్యాద. సభా మర్యాద, సంస్కారం, సభ్యత అనేవి ఏ కోశాన అయినా ఉంటే ఇలా కూర్చుంటారా ఎవరన్నా?" అంటూ అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.