కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని కోరుతూ గురువానంద గురూజీ ఆశీర్వాదాన్ని అమిత్ షా పొందినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న తిరుమలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమాన్ని అమిత్ షా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించారు. రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమంలో శుక్రవారం కుటుంబసభ్యులతో కలసి 40 నిమిషాల పాటు ఏకాంతంగా గడిపారు. మొదట ఆయన ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి అమిత్‌షా హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి నేరుగా పీఠాధిపతి గురువానంద గురూజీ కుటీరానికి అమిత్‌షా కొడుకు, కోడలుతో కలసి వెళ్లారు.
కుటీరంలోకి అమిత్‌షా కుటుంబ సభ్యులు తప్ప ఆయనతో వచ్చిన ఎవరినీ అనుమతించలేదు. అమిత్‌షా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను సైతం కుటీర ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఆపేశారు. గురూజీతో అమిత్‌షా దాదాపు 40 నిమిషాలు గడిపారు. అమిత్‌షా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం గురూజీ వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్టు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. గురూజీ వద్దకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రులు, నాయకులు నాలుగేళ్లుగా వస్తున్నారు.
రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమానికి అమిత్‌షా రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ్రమం వద్ద నాయకుల కంటే పోలీసుల హడావుడే ఎక్కువగా కనిపించింది. అమిత్‌షా లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన సమయంలో ప్రత్యేకదళం అమిత్‌షా చుట్టూ నిలిచి ఎవ్వరినీ ఆయన దగ్గరకు వెళ్ళనివ్వలేదు. ఆశ్రమం లోపల అమిత్‌షా ఉన్నంత సేపు ప్రధాన ద్వారం వద్ద కాపలాగా ఉన్న పోలీసులు బీజేపీ నేతలను కూడా లోనికి వెళ్లనివ్వలేదు. డీఎస్పీలు నంజుండప్ప, ఆంటోని, నలుగురు సీఐలు, 5 మంది ఎస్ఐలు, పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.