ఉప ఎన్నికలతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చవి చూస్తున్న వరుస ఓటిమిలే కాని... దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఏకం అవ్వటమే కాని... ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతే కాని... మొత్తానికి అమిత్ షా, మోడీలు ఇద్దరూ భూమి మీదకు దిగినట్టే ఉన్నారు... మిత్రపక్షాలు అయినా, సొంత పార్టీలో సీనియర్లు అయినా డోంట్ కేర్ అని ఇప్పటి వరకు అహం ప్రదర్శించిన గుజరాత్ బ్రదర్స్, ఎట్టకేలకు వాస్తవాలు గ్రహించినట్టే ఉన్నారు.. అందుకే, దూరం అవుతున్న విపక్షాలను బుజ్జగించటానికి, ఇన్నాళ్ళు దూరం పెట్టిన సీనియర్లను మంచి చేసుకోవాటానికి అమిత్ షా బయలు దేరారు... ఇప్పటికే ‘‘మద్దతు కోసం సంప్రదింపులు’’ పేరుతో అమిత్ షా ప్రచారం ప్రారంభించారు. 2019లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేలా పలువురు కీలక నేతలతో సమావేశమై మద్దతు కోరుతున్నారు.
ఇందులో భాగంగానే మోదీ-షా ద్వయంపై ఒంటికాలిపై లేస్తున్న మిత్రపక్షం శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రేపు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు. ఎంతోకాలం నుంచి బీజేపీతో మైత్రీబంధం ఉన్నప్పటికీ... తాజా పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అంటేనే శివసేన భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. శివసేన వ్యాఖ్యలను బీజేపీ ఇప్పటి వరకు సీరియస్‌గా తీసుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి బలహీనపడుతుండడం.. అదే అదనుగా ప్రతిపక్షాలు జట్టుకడుతుండడంతో అమిత్ షా వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది.
2014 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న శివసేన, బీజేపీల మధ్య... ఇటీవల పాల్ఘడ్ ఉపఎన్నికల తర్వాత విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ప్రతిరోజూ మాటలదాడికి దిగుతున్న శివసేన... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈనేపథ్యంలో అమిత్‌షా- ఉద్ధవ్ థాకరే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఓ బెంగాలీ దిన పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్లను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని మోదీ, షా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అద్వానీ నివాసంలో ఆయనను వీరిద్దరూ కలిసినట్లు తెలుస్తోంది. మొన్నా మధ్య, అద్వానీకి కనీసం ప్రతి నమస్కారం కూడా చెయ్యకుండా మోడీ ప్రవర్తించిన తీరు, విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే...