అమిత్ షా.. ఈయన ఒక రాజ్యసభ ఎంపీ.. ఒక పార్టీకి అధ్యక్షుడు.. మరి ఏ అధికారంతో అన్నారో కాని, ఏకంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. మీ ప్రభుత్వాన్ని కుల్చేస్తాం జాగ్రత్తా అంటూ హెచ్చరించారు. శబరిమల ఆలయంలో జరుగుతున్న గొడవలని, బీజేపీ తన హిందుత్వ అజెండాకు అనుకూలంగా మార్చుకుంది. ప్రజల ఎమోషన్స్ ని, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ‘‘శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలన్న కేరళ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తుల అరెస్టులు ఇలాగే కొనసాగితే మేం(బీజేపీ) ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు.
కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయన్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరెస్సెస్, బీజేపీ, ఇతర సంఘాలకు చెందిన 2వేల మందికి పైగా భక్తులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిందని షా ఆరోపించారు. శనివారం కన్నూర్‌లో జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గున్న ఆయన, ఈ వ్యాఖ్యలు చేసారు. ఓ వైపు కేరళలలో సీన్ హీటెక్కుతుంటే.. అమిత్ షా పర్యటన మరింత సెగ రాజేసింది. ఆందోళనకారులకు అడ్డుగోడగా బీజేపీ ఉంటుందన్నారు అమిత్ షా. కేరళ సీఎం విజయన్ను తీవ్రంగా హెచ్చరించారు.
అమిత్ షా వార్నింగ్‌లకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కేరళ సీఎం విజయన్. అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు. షా కామెంట్స్ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ దయాదాక్షిణ్యాలతో తాము అధికారంలోకి రాలేదని, ప్రజలు ఎన్నుకుంటే వచ్చామని చెప్పారు విజయన్. అయితే అసలు అమిత్ షా ఎవరని ? ఏ హోదాలో ఈ వ్యాఖ్యలు చేసారని విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నే కుల్చేస్తాం అని హెచ్చరించటం పై అభ్యంతరం చెప్తున్నారు. డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అంటూ చంద్రబాబు నిన్న ఢిల్లీలో ఆందోళన చేసింది ఇందుకే అని అన్నారు.