నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోని సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఒకటైన అమృత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది... దీనికి సంబంధించి క్యాంపస్ డిజైన్స్ ఇటు స్థానికత, అటు ఆధునికత- సృజనాత్మకతల మేలికలయికగా రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా ప్రవేశద్వారం, మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే విధంగా ఉండటం, బాగా ఆకర్షించింది... సీఆర్డీఏ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోయిన బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వారపు సమీక్షా సమావేశంలో ‘అమృత’ ప్రతినిధులు డిజైన్లతో కూడిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను చూపారు...
ముఖ్యమంత్రి సహా సమావేశంలో పాల్గొన్న వారి ప్రశంసలను చూరగొన్న సదరు డిజైన్లలోని కొన్ని ప్రధాన విశేషాలు కింది విధంగా ఉన్నాయి... మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే ప్రవేశద్వారం డిజైన్లలో చూపించారు... మంగళగిరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, నవులూరుకు సమీపంలో ఈ అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఇందులో అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది.
అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీ 6వ ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పేందుకు వీలుగా ఎపి ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. ఇందులో ఫిభ్రవరి మొదటి వారంలో నిర్మాణపనులకు శంకుస్థాపన జరపాలని, ఆగస్టులో నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలన్నది ఈ సంస్థ లక్ష్యంగా తెలిసింది. 20 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ క్యాంపస్ లనిర్మాణం జరగనున్నట్లు సమాచారం. దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.