ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుజరాతీ కంపెనీ అముల్ విషయంలో, హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఆస్తులు అన్నీ కూడా, వాటిని గుజరాతీ కంపెనీ అయిన అముల్ కంపెనీకి అప్పగించి, దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలోనే, ఈ అవగాహనా ఒప్పందాన్ని సవాల్ చేస్తూ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటీషన్ వేసారు. దీని పై ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, అలాగే ఇటు నర్సాపురం ఎంపీ రఘురామరాజు వైపు నుంచి వాదనలు జరిగాయి. రఘురామరాజు తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్రంలో అముల్ ని, పాల సేకరణ చేయవద్దని తాము చెప్పటం లేదని, కానీ అముల్ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వటం, ఖర్చు పెట్టటం, రాష్ట్ర ప్రభుత్వమే పబ్లిసిటీ ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఉండే ఆస్తులు అన్నీ కూడా అముల్ కంపెనీకి కట్టబెట్టటానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయటం, ఒప్పందాలు చేసుకోవటానికి తాము వ్యతిరేకం అని చెప్పారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తిధారులకు చెందిన ఆస్తులు అన్నీ, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అముల్ కంపెనీకి ఎలా అప్పగిస్తారని చెప్పి, ఆదినారాయణ రావు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్, హైకోర్టులో అందుబాటులో లేకపోవటంతో, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. నిన్న సాయంత్రం డివిజనల్ బెంచ్ లో, ఈ అంశం పై వాద ప్రతివాదనులు జరిగాయి. ఈ రోజు మధ్యానం రాష్ట్ర హైకోర్టు డివిజనల్ బెంచ్, దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీకి కేసుని వాయిదా వేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిందో, ఆ కౌంటర్ ని అప్పటి లోగా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, అముల్ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం పై, ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదని, హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో అముల్ కి నోటీసులు జారీ చేసింది. అయితే అముల్ పై హడావిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ఆదేశాలు ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి.