ఏమీలేని సజ్జల రామకృష్ణారెడ్డి కోట్లాధిపతి ఎలా అయ్యారని, అవినీతిని ప్రశ్నిస్తే జగన్ రెడ్డి ఫోన్ చేసి మరీ బెదిరించారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది సీఎంలని చూశానని ప్రజాస్వామ్యాన్ని ఇంతగా దిగజార్చిన సీఎంని తొలిసారి చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశానని బురద చల్లుతున్నారని, సజ్జల ముందురోజు ఓ మాట, తర్వాత రోజు ఓ మాట మాట్లాడారని మండిపడ్డారు. సీక్రెట్ బ్యాలెట్‍లో తాను ఎవరికి ఓటేశానో సజ్జలకి ఎలా తెలుసు అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇంచార్జిగా నియమించిన రోజే ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అందరూ అమ్ముడుపోయారని అంటోన్న సజ్జల కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో తనకి తెలుసు అని అన్నారు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి మందలించారని ఆనం వెల్లడించారు. ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేశానని, ఎవరికి ఓటు వేశానో చెప్పనని ఆనం రాంనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అని వాపోయారు. జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించానని, అభివృద్ధి నిలిచిపోయింది.. ప్రాజెక్టులు, నిర్మాణాలు జరగట్లేదని ప్రశ్నించినందుకే తన గొంతుకను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నలభై ఏళ్లుగా అనేకమంది నాయకుల వద్ద పనిచేశానని, ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంత దిగజారడం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సజ్జల, నీ మొఖం అద్దంలో చూసుకో... ఆనం సంచలన వ్యాఖ్యలు
Advertisements