అనంతపురం జిల్లాకు ఎఫ్ 3 రేసింగ్ సర్క్యూటు రానుంది. తనకల్లు మండలం కోటపల్లిలో 3.2 కి.మీ పొడవైన రేసింగ్ ట్రాకుతో పాటు ఆటోమోటివ్ థీమ్ పార్కు, విలాసవంతమైన రిసార్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
మొత్తం మూడు దశలలో రూ. 149 కోట్లతో నిర్మించ తలపెట్టిన రిసార్టుతో 360 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ నుంచి పర్యాటకులను ఆకట్టుకునేలా 245 ఎకరాల పరిధిలో ‘నిధి మార్క్ వన్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ దీని ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది.
40 రూములతో రిసార్టు, గోల్ఫ్ కోర్సు, ఎమ్యూజ్మెంట్ పార్కు, హెలిప్యాడ్ ఈ ప్రాజెక్టులో భాగంగా వుంటాయి. ఏడాదిన్నరలోనే మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేస్తామని నిధి సంస్థ వెల్లడించింది. ఇక్కడ నిర్వహించే రేసులను ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది టీవీ వీక్షకులకు తిలకిస్తారు.
భారతదేశంలో ఇప్పటివరకు చెన్నయ్, గ్రేటర్ నోయిడాలో మాత్రమే రేసింగ్ సర్క్యూట్లు వున్నాయి.