కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా జలసిరితో కళకళలాడుతోంది. ఇందుకు కారణమైన మంత్రికి రైతులే కాదు.. ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అధికారులను పరుగులు పెట్టించి.. నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయిస్తున్న దేవినేని ఉమా అంటే, ఇప్పుడు అనంత ప్రజలకు సొంత మనిషిలా అయ్యారు... కరువు జిల్లాగా పేరొంది... చుక్క నీరులేక అల్లాడిపోయే అనంతపురం జిల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.. మండు వేసవిలో కూడా అక్కడ జలసిరులు పారుతున్నాయి.. ఇందుకు కారణం భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమానేనని అంటున్నాయి టీడీపీ శ్రేణులు.. రైతులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు దేవినేని ఉమ ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉండటం ఆ జిల్లా వాసులకు ప్లస్‌పాయింట్ అయ్యింది. ఆయన ఇక్కడి పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు.
నీటి కోసం అనంత జిల్లా వాసులు పడుతున్న కష్టాలను గమనించారు. ఎక్కడెక్కడ నీటిని నిల్వ ఉంచవచ్చో పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో చకచకమంటూ పనులు కానిచ్చేశారు. జిల్లాకు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక ప్రాజెక్టును టేకప్ చేయడం.. అధికారులను పరుగులు పెట్టించడం చేశారు. ప్రాజెక్టులు శరవేగంగా పూర్తయ్యాయంటే అందుకు కారణం దేవినేని పనితీరే! హంద్రీనీవా రెండో దశ పనుల్లో భాగంగా మడకశిర... మారాల... చెర్లోపల్లి రిజర్వాయర్ల పనులను పర్యవేక్షించారు. రాజకీయ పలుకుబడితో నత్తనడకన పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల భరతం పట్టారు. అనంతపురం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 62 టీఎంసీల నీటిని తెప్పించగలిగారు.
అనంత నీటి కష్టాలు తీరడంతో రైతులు మురిసిపోతున్నారు. తాము చేసిన బృహత్తరమైన పని జిల్లా రైతాంగం గుర్తుంచుకునే విధంగా ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది తెలుగుదేశంపార్టీ! అనంతపురం నగరంలో క్లాక్ టవర్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కలశాలు ధరించి వెయ్యిమంది మహిళలతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. కృష్ణా జలాలతో తెలుగుతల్లి విగ్రహానికి పూజలు చేస్తారు. అలాగే గండికోట నుంచి ఎత్తిపోతల ద్వారా మరో 20 టీఎంసీల నీటిని తీసుకురానున్నారు.. ఉంతకల్లు.. మడకశిరలో మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. మొత్తంగా అనంతపురం జిల్లా ప్రజల నీటి కష్టాలు ఇప్పటికి తీరాయి...