ఇది కార్పొరేట్ ప్రీ స్కూల్ అనుకునేరు. కానే కాదు. దానిని తలదన్నే రీతిలో రూపుదిద్దుకున్న అంగన్ వాడీ కేంద్రం. నమ్మలేకపోతున్నారా? నమ్మి తీరాల్సిందే. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అత్యాధునిక అంగన్ వాడీ కేంద్రం. కృష్ణా జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో దీనిని తీర్చిదిద్దింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాలను దశల వారీగా 'మోడల్ అంగన్ వాడీ సెంటర్స్'గా తీర్చిదిదటానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీకాంతం కొద్దికాలం క్రితం ప్రకటించారు. స్వీకారం కార్యక్రమంలో భాగంగా హాస్టల్స్, పాఠశాలలు, ఆసుపత్రులను దాతల సహాయ సహకారాలతో ఆధునికీకరిస్తున్న కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని భావించారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా మోడల్ అంగన్ వాడీ స్కూళ్ళ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించారు. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. ముందుగా ఒక స్కూల్‌ను మోడల్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దానిని ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. భవనం లోపల చక్కటి ఫ్లోరింగ్, సీలింగ్, వాల్కేరింగ్ సదుపాయాలు కల్పించారు. అంగన్ వాడీ పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు. పై ఫ్లోర్, గోడల నిండా విద్యాసంబంధ చిత్రాలు, ప్రహరీ లోపల, బయట సామాజిక స్పృహను పెంపొదించే ఛాయా చిత్రాలు ఉన్నాయి.
పిల్లల కోసం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్డి కూడా సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. పిల్లలు ఆడుకోవటానికి ఆటపరికరాలను ఏర్పాటు చేశారు. కింద టైల్స్ పరిచారు. చుట్టూ చక్కని గార్డెనింగ్‌తో చూడచక్కటి వాతావరణాన్ని రూపొందించారు. ఇవన్నీ పేద పిల్లల కోసం. మనం, మన పిల్లలను పమించే కార్పొరేట్ ప్రీ స్కూల్స్ కూడా ఇంత అందంగా, సౌకర్యవంతంగా, హంగులతో ఉండదు అంటే ఆశ్చర్యం కాదు. ఇప్పుడు ఈ మోడల్, రాష్ట్రమంతటా ఏర్పాటు చేయ్యనుంది ప్రభుత్వం. త్వరలోనే అన్ని అంగన్ వాడీ కేంద్రాలు ఇలా మారనున్నాయి.