పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి అనిల్ కుమార్ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడాడని, ప్రతిపక్షంపై తన అక్కసునంతా వెళ్లగక్కి, ఈ ప్రభుత్వ నిర్వాకాలతో తనకు వచ్చిన కడుపు ఉబ్బరం తగ్గించుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! పోలవరంప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారన్న ప్రజలకు సమాధానం చెప్పలేక, ఒకరకమైన అసహనంతోనే కొన్ని మీడియా సంస్థలు సహా, అందరిపై మంత్రి అనిల్ కుమార్ అక్కసు వెళ్ల గక్కుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కి ఖర్చుపెట్టిన డబ్బులు, రీయింబర్స్ మెంట్ చేయించుకొని జగన్ రెడ్డి తన 30నెలల పాలనలో రూ.4వేల కోట్ల వరకు కేంద్రం నుంచి పొందాడు. మీడియాకు పత్రికలకు పోలవరంప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక్క సమాచారమైనా ఏనాడూ ఎందుకు మీడియాకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి, మంత్రి అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చే ధైర్యం లేదా? చంద్రబాబునాయుడి గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు 71శాతంవరకు జరిగితే, తన 30నెలల పాలన లో జగన్ రెడ్డి ఎంతశాతం పనులు చేశాడు? ఏం చేశారో చెప్పమని ప్రజలు, సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలు అడుగుతుంటే, మంత్రి ఎందుకు బూతుపురాణం వల్లెవేస్తున్నాడు? గోదావరికి వరదలు వచ్చి, అక్కడున్నవారంతా కొండలు, గుట్టలపాలైతే, వారికి ఇస్తామన్న రూ.2 వేల పరిహారమే ఇంతవరకు ఇవ్వని అసమర్థ, దద్దమ్మ, చేతగాని ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి మీరు పోలవరం ప్రాజెక్ట్ కడతారా? పూర్తిచేసే ముఖాలేనా మీవి? 30నెల ల్లో గజ్జి ఏంటి మంత్రీ? రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి ఎవరు గజ్జితో పనిచేశారో తెలియదా జగన్ రెడ్డి? జూన్ 2019లో జరిగిన తొలి రివ్యూ మీటింగ్ లో అధికారులు చాలాస్పష్టంగా జగన్ రెడ్డికి చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎల్ అండ్ టీ సంస్థ చేసిందని, ప్రపంచమంతా గర్వించేలా నిర్మాణం జరిగిందని చెప్పారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జరగాలంటే, కాపర్ డ్యామ్ ఎగువన, దిగువన పనులు చేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే రెండేళ్లలోనే డ్యామ్ పనులు పూర్తి చేస్తామని వివరంగా చెప్పారు. 2022 జూన్ నాటికి పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తిచేసి విద్యుత్ కూడా వచ్చేలా చేస్తామన్నారు కదా జగన్ రెడ్డి. కానీ నువ్వేం చేశావు? అధికారంలోకి వస్తే పట్టిసీమ పంపులు పీకుతానన్నవాడిని తీసుకొచ్చి పోలవరం పనుల్లో పెట్టావు. పట్టిసీమ పనికిరాదు.. ఆ నీళ్లు తెచ్చి ఎక్కడపోస్తారు అన్నారు. పట్టిసీమ నీళ్లు సముద్రంలో పోస్తారా అని జగన్ రెడ్డి ప్రధానప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు మా ట్లాడాడు.
గోదావరి నీళ్లు 350టీఎంసీలు తెచ్చి కృష్ణాడెల్టాను కాపాడటమేగాక, అదే నీటిని శ్రీశైలానికి తరలించి, రాయలసీమకు తరలించడం జరిగింది. పోలవరంప్రాజెక్ట్ విషయంలో జగన్ రెడ్డి ఎందుకింత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నా డు. తెలుగువారి గుండెచప్పుడు, జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తైతే, రాష్ట్రానికి తాగు నీటిసమస్య ఉండదు. అలాంటిప్రాజెక్ట్ నిర్మాణంలో ఏంచేశారనే దానిపై జగన్ రెడ్డి ఎందుకు నోరువిప్పడంలేదు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం, రాష్ట్రజలవనరుల శాఖాధికారులు నిర్మాణంచేశారు. ఆవిధంగా జరిగిన పనులకు సంబంధించి రూ.7వేలకోట్లు వచ్చాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.4వేలకోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో డ్యామ్ సైట్లో పనులుఎందుకు చేయించలేదు? నిర్వాసితులకు డబ్బులివ్వకుండా లిక్కర్ కంపెనీలకు అడ్వాన్స్ లు చెల్లించారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు. పీటర్ కమిటీ అని ఏవేవో డ్రామాలుఆడారు. పుల్లారావు అనేవ్యక్తి ఢిల్లీ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ పై స్పందిస్త్తూ, కేంద్రప్రభుత్వం పోలవరంప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి లేదని స్పష్టంచేసింది. ఇన్నిజరిగినా కూడా జగన్ రెడ్డి తన ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమారప్రగల్భాలు ఆపలేదు. పోలవరం నిర్వాసితులకు ఈ ముఖ్యమంత్రి, మంత్రి అనిల్ రూపాయికూడా ఇవ్వలేదు. బూతులు మాట్లాడే మంత్రులు, వారితో మాట్లాడించే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ కడతారా? 5 ఏళ్లలో చంద్రబాబునాయుడు 62ప్రాజెక్ట్ లకు శ్రీకారంచుట్టి, ఇరిగేషన్ రంగంలో విప్లవం తీసుకొచ్చారు.
ఒకజాతీయ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడి హయాంలో పూర్తవుతుందని దేశమంతా ఎదురుచూసింది. ఈ 30నెలల్లో మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ లను ఎంతవరకు పూర్తిచేశారో చెప్పండి. నెల్లూరు బ్యారేజ్ మే 2021కి, సంగం బ్యారేజ్ మే 2021, వెలిగొండ ప్రాజెక్ట్ ఆగస్ట్ 2021 కి పూర్తవుతాయనిచెప్పారు. అధికారంలోకి వచ్చాక మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ ల్లోనే ఎక్కడా పనులు జరగలేదు. 30 నెలల్లో ఇరిగేషన్ రంగానికి ఎంతఖర్చుపెట్టారో, ఏఏ ప్రాజెక్ట్ ల్లో ఎంతశాతం పనులు చేశారో పూర్తివివరాలతో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ముందా మీకు? టీడీపీ హాయాంలో జరిగినపనులకు సంబంధించి వచ్చిన రూ.4వేలకోట్లను లిక్కర్ కంపెనీలకు ఇచ్చి నిర్వాసితుల నోట్లో మట్టికొట్టారు. నిర్వాసితులకు తీరని ద్రోహంచేసి, వరద సాయం కూడా ఇవ్వకుండా వారిని కొండలు, గుట్టల్లో వదిలేశారు. ఆఖరికి వారికి ఇస్తామన్న రూ.2వే ల పరిహారంకూడా ఇప్పటికీ అందలేదు. ప్రధానమంత్రిని కలవడానికి భయపడే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే. ప్రధానిని కలిసి పోలవరానికి అవసరమైన నిధులు ఎందుకు అడగలేకపోతున్నావు జగన్ రెడ్డి? తరుముకొస్తున్న కేసుల భయంతోనా? పోలవరం ప్రాజెక్ట్ డిజైన్స్ ఫైనల్ చేయించుకోలేనివారు.... మీరు కోటలోఉన్నా.. పేటలో ఉన్నాఒకటే, మీకెందుకయ్యా అధికారం? పోలవరం డ్యామ్ కట్టడం మీ ఇష్టం నా ఇష్టం కాదు జగన్ రెడ్డి? శాసనసభలో బూతులుతిట్టి ఇప్పటికే భ్రష్టుపట్టారు. అందుకే గౌరవసభలతో ప్రజల్లోకి వెళుతున్నాం.