తెలుగు మహిళా రాష్ట్ర అద్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మహిళలను మోసం చేసేందుకు మాతృదినోత్సవం రోజు నైనా నిజాలు చెప్పలేని ధీనావస్థలో జగన్ ప్రభుత్వం ఉంది. మద్య నియంత్రణ పేరుతో కోట్లు ఖర్చు పెట్టి ప్రతికలకు, మీడియాకు అడ్వర్ టైజ్ మెంట్లు ఇవ్వడం బాధాకరం. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఆర్ధికంగా, మానసికంగా కరోనా తరువాత బలపరుచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం జేబులు నింపుకోవడానికి మద్యం షాపులు తెరిచి పేదల కడుపుకొట్టడం సిగ్గుచేటు. జే టాక్స్ కోసం ప్రజలను బలిగొనడానికైనా జగన్ సిద్ధపడటం హేయం. అత్యధికమైన ధరలు పెంచాం కాబట్టి మద్యం సేవించే వారి సంఖ్య తగ్గుతుందని జగన్ చెప్పడం ఆయన అవగాహన లేమికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనం. మద్యం సేవించే వారు ధరలు పెంచినా తాగుతారు గాని తగ్గించరు. మద్యం బానిసలు ఇంట్లో సామాన్లు, మహిళల మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి మరి మద్యం కొని తాగుతున్నారు. ఇప్పటికే మహిళలు పోలీస్ స్టేషన్ల లో కేసులు పెడుతున్నారు. మద్యం కేసులు పెరిగిపోతున్నాయి. జగన్ మద్యంతో చేస్తున్న హంగామాకి మహిళలు, చిన్నపిల్లలు బలైపోతున్నారు. మద్య పాన నిషేదం చేస్తానని హామీనిచ్చి మహిళల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు మద్యం షాపులు తెరిచి అదే మహిళలను బాధపెట్టడం దురదృష్టకరం."
"గతంలో జగన్మోహన్ రెడ్డి 20% మద్యం షాపులు తగ్గించామని ప్రగల్బాలు పలికారు. టెండర్ వేయని, వేయలేని మాత్రమే తగ్గించారు. మద్య పాన నిషేదం అనేది ఒక కొంగ జపం చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారు. మద్యం మానిపించడానికి ఒక్క రీఎడిక్షన్ సెంటర్, కౌన్సింగ్ సెంటర్, టీం, యంత్రాంగం ఏమైనా పెట్టారా? మద్యం పాన నిషేదం చేయడానికి జగన్ కు వచ్చిన మంచి అవకాశం దానినికూడా ఆయన నీళ్ల పాలు చేశారు. మద్యం మహామ్మారి వలన ఆరెంజ్ జోన్ లో ఉన్న వైజాగ్ రెడ్ జోన్ లోకి వెళ్లింది. ఈ రోజు 13% మద్యం షాపులను నెలాకరకు తగ్గిస్తామని చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా మద్యం షాపులు తెరవలేదు. చుట్టు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. గతంలో రోజుకు రూ.300 కూలీ చేసి సంపాదించే వ్యక్తి రూ.100తో తాగి రూ.200 ఇంట్లో ఇచ్చేవారు. నేడు ఆ రూ.300 కాకుండా మరో రూ.200 అప్పు చేస్తున్నారు. 5 ఏళ్లల్లో జే టాక్స్ రూపంలో రూ.25వేల కోట్లు వసూలు చేయడం అఫిషియల్ పిక్ పాకెటింగ్ కాదా? విద్యా దీవన పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు."
:ఆ తరువాత రోజునే మద్యం షాపులు ప్రారంభించారు. ఇంట్లో తండ్రి గొంతు తడి పధకం కింద దానిని వాడుకున్నారు. జనాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానని చెప్పి మరో చేత్తో మద్యం పేరుతో లాక్కుంటున్నారు. 16 నెలల జైల్లో ఉన్న నేపధ్యం ఇలాంటి ఆలోచనలో పుట్టుకొస్తాయి. జగన్ కు ఇచ్చే సలహాదారులు ఇదే తరహాలో ఉన్నారు. 36 కంపెనీల ద్వారా 1300 మద్యం బ్రాండులను తీసుకువచ్చారు. మద్య నిషేదం చేస్తానని హామీనిచ్చిన పెద్ద మనుషులు అన్ని బ్రాండులను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అన్ని కంపెనీలకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమోచ్చింది? మద్యం హుండీల్లో డబ్బులు వేయడానికి ప్రజలు బారులు తీరుతున్నారు. కల్తీ మద్యం, నాటు సారా ఏరులై పారుతుందని స్పీకర్ అన్నారు. నాటు సారా తయారుచేయడంలో జగన్ వాలెంటరీలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. గ్యాస్ స్టౌ మీద నాటు సారా తయారు చేయడం వారికే కుదిరింది. 24వేల బెల్టు షాపుల కేసులు జగన్ ప్రభుత్వంలోనే నమోదయ్యాయి. కర్నూలు లో బెల్టు షాపులకు ఎక్సైజ్ పోలీసులచేత మద్యం సరఫరా చేయించారు. జే టాక్స్ కోసం ఆఖరికి పోలీసుల చేత తప్పుడు పనులు చేయించే దుస్థితికి జగన్ దిగజారిపోయారు. లిక్కర్ పెట్టెలో లెక్కలు కాదు కావాల్సింది నాటు సారా బట్టీలు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పాలి. మద్యం రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్లు తగ్గుతారని ముఖ్యమంత్రి ఆలోచనకు నా సానుభూతి." అని అనిత అన్నారు.