ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ రోజు సర్ప్రైజ్ ఇచ్చారు చంద్రబాబు ! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు సోమవారమే తొలివిడత సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. ఆదివారం జరిగిన భేటీలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం రాష్ట్రంలోని సుమారు 50 లక్షల రైతుల కుటుంబాలకు వారి బ్యాంకుల్లో వెయ్యి రూపాయల చొప్పున నగదు జమ కానుంది. అలాగే ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆదివారం జారీ చేసింది. అన్నదాత సుఖీభవలో భాగంగా కౌలు రైతులకు కూడా రూ.15వేలు ఆర్థిక సాయం చేయనుంది. వాస్తవానికి మార్చి నెలలో తొలివిడత డబ్బు వేయాలని అనుకుంది. కానీ, సత్వరమే కొంతసొమ్మును వారి ఖాతాల్లో వేసేయాలని నిర్ణయించింది. దీనికోసం ఆదివారం కూడా రాష్ట్ర సర్కారు కసరత్తు చేసింది. బ్యాంకర్లతో మాట్లాడింది.
ఈ పథకం కింద డబ్బు ఇచ్చేందుకు అవసరమైన సర్దుబాటు చేసి, బ్యాంకర్లను కూడా సంసిద్ధం చేసింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద షరతుల్లేకుండా పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఐదెకరాలలోపు రైతులకు మాత్రమే సాయం అందించేందుకు పథకం ప్రకటించింది. అయితే రాష్ట్రం మాత్రం ఐదెకరాలకు మించి ఉన్న రైతులకూ సాయం అందిస్తామని చెప్పింది. ఐదెకరాల లోపున్న రైతులకు రూ.6వేలు కేంద్రం ఇస్తే.. రాష్ట్రం మరో రూ.9వేలు ఇస్తుంది. అదే సమయంలో ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతు కుటుంబాలకు రూ.10వేలు ఇవ్వనుంది. అయితే ఉదయం నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడుతూ ఉండటంతో, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకం కింద కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యమైన కానుక ప్రకటించింది. సన్న, చిన్నకారు రైతులతో సమానంగా కౌలు రైతులకూ రూ.15వేలు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. కౌలు రైతులకు ఈ మొత్తాన్ని 2019 ఖరీ్‌ఫలోపే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కౌలు రైతులు 15.35లక్షల మంది ఉన్నారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2018-19లో మొత్తంలో ఎల్‌ఈసీ, సీఈసీ, రైతుమిత్ర, జాయింట్ లయబులిటీ గ్రూపుల కింద 11.20లక్షల మంది రైతులకు వివిధ బ్యాంకులు పంట రుణాలిచ్చాయి. ఈ ఏడాది పంట రుణం తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలన్నింటికీ పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉందని అదికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం విడుదల చేసిన ‘అన్నదాత-సుఖీభవ’ పథకం ఉత్తర్వుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఐదెకరాలలోపు రైతులకు ఇచ్చే రూ.6వేలకు రాష్ట్రం మరో రూ.9వేలు కలిపి రూ.15వేలు, పెద్ద రైతులకు రూ.10వేలు, కౌలురైతులకు రూ.15వేలు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని కిస్తీల వారీగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(నేరుగా నగదు బదిలీ) విధానంలో రైతుల ఖాతాలకు జమ చే యనున్నారు. ఇందులో మొదటి కిస్తీ కింద రూ.4వేలు చొప్పున వచ్చే (మార్చినెల)లోనే జమ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా రూ. వెయ్యి సోమవారం నాడే రైతుల ఖాతాల్లోకి వేయాలని నిర్ణయించింది.