ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి మరో ఐఏఎస్ అధికారి బలి కాబోతున్నారా.? చిత్తూరు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నపై ఈసీ వేటు వేస్తుందా? తాజా పరిణామాలు పరిశీలిస్తే ఆ దిశగా చకచకా పావులు కదులుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 పోలింగ్ బూత్‌లలో రీపోల్ జరపాలని ఈసీ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తెరవెనుక మరో వ్యవహారం కూడా నడిచినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన తర్వాత వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి రీపోల్‌కు ప్రతిపాదనలు వచ్చాయి. ఈవీఎంలు పనిచేయని చోట మాత్రమే రీపోల్‌కు ఆదేశాలిచ్చారు. సాధారణంగా ఇలాంటి ప్రతిపాదనలపై కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకోవడం ఆనవాయితీ.
అయితే, ఈ వ్యవహారంలో కలెక్టర్‌తో సంబంధం లేకుండానే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి ఈసీకి 10, 11 తేదీల్లో ప్రతిపాదనలు వెళ్లడం... 15వ తేదీ కల్లా రీపోల్‌కు ఉత్తర్వులు రావడం చకచకా జరిగిపోయింది. ఇక్కడే అంతర్గతంగా మరో వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ఒక పార్టీ కార్యకర్తలు బూత్‌లలోకి అక్రమంగా పరిశీలిస్తే తమ దృష్టికి ఎందుకు తేలేదని ఎన్నికల కమిషన్ చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్నను వివరణ కోరినట్లు తెలిసింది. ప్రద్యుమ్న ఎలాంటి వివరణ ఇచ్చినా దానితో సంబంధం లేకుండా ఆయనపై బదిలీ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రక్రియకు ముందే శ్రీకాకుళం కలెక్టరును, సీఈవోను బదిలీ చేసిన ఈసీ ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బదిలీ చేసింది. ఆ తర్వాత మూడు జిల్లాల ఎస్పీలు, ఇంటెలిజెన్స్ చీఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల కమిషన్ తప్పించేసింది. ఆ కోవలో ప్రద్యుమ్న కూడా చేరబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే చంద్రగిరిలో 35 రోజుల తరువాత రీపోలింగ్ పై విమర్శలు వస్తున్న టైంలో, ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పించే ప్రయత్నం జరుగుతున్న విషయం తెలుసుకుని, వైసీపీ స్కెచ్ తెలుసుకుని, టిడిపి నేతలు మండి పడుతున్నారు. మరో వారం రోజులు, వీళ్ళ పెత్తనం అంటూ పెదవి విరుస్తున్నారు.