ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఇది క్రమంగా బలపడి రాగల 24 గంటల్లో తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ఇప్పటికే కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతంగా మారింది. తీరం వెంబడి ఈదురుగాలులు కూడా ప్రారంభమయ్యాయి.
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశారు. సచివాలయంలోని రియల్‌టైం గవర్నెన్స్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ఆదేశాలు జారీచేస్తున్నారు.
అల్లకల్లోలంగా సముద్రం.. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఇన్కాయిస్ సూచించినట్లు విపత్తు నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్ వర్గాలు వెల్లడించాయి. ‘నెల్లూరు జిల్లా దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువా వరకూ అలలు 3 నుంచి 6.5 మీటర్ల వరకు ఎగసి పడతాయి. తీరం వెంట 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ నెల 14 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని’ హెచ్చరికలు జారీ చేశాయి.