ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, అత్యధికంగా పాదయాత్ర చేసింది మాత్రం, తూర్పు గోదావరి జిల్లాలో. 63 రోజులు పాదయత్ర తూర్పు గోదావరి జిల్లాలోనే సాగింది. దీనికి ప్రధాన కారణం, ఇక్కడ తెలుగుదేశం చాలా బలంగా ఉందని, అందుకే అక్కడ వారిని కట్టడి చేస్తే, దీని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని జగన్ అభిప్రాయం. వ్యూహాత్మకంగా పట్టు సాధించాలన్న ఆయన ఎత్తుగడ అంతగా పారినట్టు కనిపించలేదు. తమ అధినేత పాదయాత్రతో తూర్పు రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఆశపడిన ఆ పార్టీ నాయకులకూ ఇప్పుడు అర్థంకాని గందరగోళ పరిస్థితి. జగన్ వ్యూహాత్మకంగానో, ఆవేశపూరితంగానో చేసిన వ్యాఖ్యానాలు పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి.
సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై చేసిన కామెంట్లు పెను దుమారాన్నే రేపాయి. జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైనం ఇప్పటికీ ఆ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. తుని ఘటనలో సీఎం చంద్రబాబే రైలు తగుల బెట్టించారన్న ఆరోపణ సైతం పేలలేదు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి నుంచీ స్పందన కరువు. అప్పటి నుంచి, జగన్ కు ఈ జిల్లాలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, గుడ్ బై చెప్పనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలతో మాత్రం ఆ పార్టీ నేతలు నిష్క్రమిస్తున్నారు.
ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు దుర్గేశ్ వంటి పెద్ద నేత కూడా అదే బాట పట్టడం వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆయన వైసీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి టికెట్ ఆశించారు. అయితే గతంలో పోటీచేసిన ఆకుల వీర్రాజుకే టికెట్ ఇస్తామని జగన్ చెప్పినట్లు సమాచారం. ఈలోగా జిల్లాలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో దుర్గేశ్ వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై శనివారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజమహేంద్రవరం రూరల్ నుంచి పోటీ చేయడానికి కూడా నిర్ణయం జరిగినట్లు సమాచారం.