ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తుంటే, తన పార్టీ వంద అడుగులు వెనక్కు వెళ్తుంది. దీనికి జగన్ వైఖరే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఒక పక్క జగన్ వేసుకున్తున్న సెల్ఫ్ గోల్స్ తో, పార్టీ విలవిలలాడుతుంటే, జగన్ వైఖరితో విసుగు చెంది కొంత మంది నేతలు పార్టీ మారుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఎమ్మల్యే జగన్ కు షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. బాపట్ల, సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. బాపట్ల నుంచి గెలుపొందిన కోన నియోజకవర్గంతో తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆయన పార్టీని బలోపేతం చేయడం లేదని, ప్రజల్లోకి వెళ్లడం లేదనే వాదన వినిపిస్తోంది. పైగా పార్టీ అధినేత జగన్ ఇచ్చిన ఆదేశాలను సైతం పూర్తిగా ఆచరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇక్కడ వైసీపీ పార్టీ ప్రభావం నానాటికీ బలహీనంగా మారిపోతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమధ్య ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బంద్‌ను చేశాయి. చంద్రబాబుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను చేపట్టాయి. కానీ వైసీపీ ఎమ్మెల్యే కోన ఉన్న చోట బాపట్లలో బంద్ అనుకున్న స్థాయిలో జరగలేదనే విశ్లేషణ ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు.
దీనిని చూస్తే కోన రఘుపతి వైసీపీపై ఎటువంటి వైఖరితో ఉన్నారనేది స్పష్టమవుతున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కోన రఘుపతి వర్గం మాత్రం వేరేగా ఉంది. జగన్ తమ నాయకుడుని పట్టించుకోవటం లేదని, చులకనగా చూస్తూ, అవమాన పరుస్తున్నారని అంటున్నారు. మొన్నా మధ్య టికెట్ విషయం పై జగన్ దగ్గరకు వెళ్ళగా, నేనేమి చెయ్యాలో నాకు తెలుసు, నీ ఇమేజ్ వల్ల ఏమి గెలవలేదు, రెడ్డి సామాజికవర్గం ఓటర్లు 28 వేల పైనే ఉన్నారు, అందుకే గెలిచావ్ అంటూ హేళనగా మాట్లాడారని, అప్పటి నుంచి కోన అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్‌తో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు నరేంద్ర వర్మ ధాటికి నియోజకవర్గంలో వైసీపీ డోలయామానంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.