శ్రీవారి పేరుతో రాజకీయాలు చేస్తూ, మత ప్రచారం చేసే వారితో కలిసి తిరుగుతూ, తిరుమలని, శ్రీ వారి పరువుని తీసుకున్న దీక్షితులకు మరో షాక్ తగిలింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి నుంచి శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులును తొలగిస్తూ దేవస్థాన ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఆ స్థానంలో నూతన ప్రధాన అర్చకుడుగా ఇటీవల నియమితుడైన వేణుగోపాల దీక్షితులును నియమించింది. ఆలయ అర్చకులు 65 ఏళ్లకు రిటైర్మెంట్ కావాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే ఆయన ప్రధాన అర్చకుడిగా రిటైరెడ్ అయ్యారు. దీక్షితుల వ్యవహార శైలి, టీటీడీపై చేస్తున్న విమర్శలతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశంలో ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. ఇప్పటికే అర్చక పదవి నుంచి తొలగించిన టీటీడీ.. ఇప్పుడు ఆగమశాస్త్ర సలహాదారు పదవికి నుంచి కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
తిరుమల శ్రీవారి విరాళాల వినియోగంలో ఆచితూచి వ్యవహరించాలని, తెలుగు రాష్ట్రాల్లో ఈ-దర్శన్ కౌంటర్లు నిర్వహించాలని పలువురు సభ్యులు సూచించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అభివృద్ధికి మొదటి విడత రూ.36 కోట్లు, తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, ప్రకాశం జిల్లా దుద్దుకూరులో చెన్నకేశవస్వామి ఆలయం పునరుద్ధరణకు రూ.25 లక్షలు కేటాయించినట్టు టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో రూ.70 కోట్లతో భక్తుల వసతి సముదాయం నిర్మాణానికి స్థల పరిశీలనకు నిర్ణయించినట్టు చెప్పారు.
కాగా, ఆగమ సలహా మండలి సభ్యుడిగా ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులును టీటీడీ నియమించింది. అర్హులైన మిరాశి వంశస్థులైన 12 మందిని అర్చకులుగా నియమించామని, ఇందులో నలుగురు తిరుమలకు, మిగిలిన 8 మందిని గోవిందరాజుస్వామి ఆలయంలో అర్చకులుగా నియమించినట్టు తెలిపారు. సమావేశంలో సభ్యులు సుధా నారాయణమూర్తి, శివాజీ, బొండా ఉమామహేశ్వరరావు, రాయపాటి సాంబశివరావు, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాథం, శ్రీకృష్ణ, అశోక్‌రెడ్డి, పార్థసారథి, ఇ.పెద్దిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనరు అనూరాధ పాల్గొన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ తలనీలాల ద్వారా రూ.133.33 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు మండలి దృష్టికి తెచ్చారు.