అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. గతంలో తాము ఆ కంపెనీని టేకోవర్ చేసుకుంటామంటూ ముందుకొచ్చిన జీఎస్సెల్ గ్రూప్ ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హైకోర్టు విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు మరోసారి జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది. గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా 10 ఆస్తులకు సంబంధించిన విలువను సీఐడీ కోర్టుకు సమర్పించింది.
సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ చెప్పాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్టు సమాచారం. జిల్లాల వారీగా ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటుచేసి వాటిద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని ప్రతిపాదించింది. అంతేగాకుండా అవసరమైతే కొంత మొత్తాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుమతిస్తే బ్యాంకులతో ఓటీఎస్(ఒన్ టైం సెటిల్మెంట్)కు చర్చిస్తామని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. దీన్ని విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్‌కు సంబంధించి అత్యధిక విలువ కలిగిన పది ఆస్తుల జాబితాను ఏపీ సీఐడీ మంగళవారం హైకోర్టుకు సమర్పించింది. ఏప్రిల్ 25న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని రూపొందించింది. ఇవన్నీ ఏ బ్యాంకులోనూ తనఖాలో లేనివే. అగ్రిగోల్డ్ కేసులో కాంపింటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న సీఐడీ అదనపు డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ వివరాలను హైకోర్టుకు నివేదించారు. మచిలీపట్నంలోని చల్లపల్లి జమీందార్ వీధిలో ఖాళీ ప్లాట్. విజయవాడ మొగల్రాజపురంలో 24000.92 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన జీ ప్లస్ 4 భవనం. విలువ రూ.10.55 కోట్లు. విజయవాడ కండ్రికలో 4199.7 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన పారిశ్రామిక భవనం (5427.64 నిర్మితప్రాంతం). విలువ రూ.9.23 కోట్లు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామం అల్లూరు రోడ్డులోని వ్యవసాయ భూమి.విజయవాడ వాంబే కాలనీలో ఖాళీ ప్లాట్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోతెగుంట గ్రామంలో వ్యవసాయ భూమి. విలువ రూ.6.7 కోట్లు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో 75.96 ఎకరాల భూమి (టేకు, చింత తదితర చెట్లున్నాయి). విలువ రూ.4.93 కోట్లు.