17వ లోక్‌సభ ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 543 ఎంపీ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుద చేయడం జరిగింది. జూన్ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనున్నది. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఈసీ... దేశంలో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. అన్ని రాష్ట్రాల సీఈవోలతో చర్చించినట్లు సీఈసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే దశలోనే జరగనున్నాయి.
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కాగా మే 23న కౌంటింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా, ఏప్రిల్ 11నే జరగనున్నాయి. నోటిఫికేషన్ వివరాలు.. - మార్చి 18న తొలి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ - మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ - మార్చి 26న నామినేషన్ల పరిశీలన - నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 గడువు - మే 23న ఓట్ల లెక్కింపు...ఏప్రిల్ 11న ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్(25), అరుణాచల్(2), అసోం(5), బీహార్(4), చత్తీస్ గఢ్(1), జమ్ముకశ్మీర్(2), మహారాష్ట్ర(7), మణిపూర్(1), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్(1), ఒడిషా(4), సిక్కిం(1), తెలంగాణ(17), త్రిపుర(1), యూపీ(8), ఉత్తరాఖండ్(5), వెస్ట్ బెంగాల్(2), అండమాన్(1), లక్షద్వీప్(1)లలో పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.
" శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై చర్చించాం. రైతులకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఉంటుంది. పరీక్షలు, పండుగ తేదీలను పరిగణనలోకి తీసుకున్నాం. 99.36 శాతం ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్- 1950కి కాల్ చేసి ఓటు సరిచూసుకోవచ్చు. ఓటర్ల తుదిజాబితా ప్రకటించాక మార్పులుండవు. పోలింగ్‌కు 5 రోజుల ముందు ఓటర్ స్లిప్‌లు ఇస్తాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తాం. మొత్తం 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను ఉంచుతాం. ఓటర్‌కార్డు లేకుంటే 12 గుర్తింపు కార్డులతో ఓటేయవచ్చు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి" అని సీఈవో ప్రకటించారు.