ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మరో సంచలనం అనే చెప్పాలి. అంతే కాదు, ఎప్పుడైనా రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, అధికారులు బుక్ అవుతారు జాగ్రత్త అంటూ వినిపించే మాట, ఇప్పుడు నిజం అయ్యింది. ఇన్నాళ్ళు కోర్టు ధిక్కరణ కేసులు విషయంలో కేవలం కోర్టులు ముందు హాజరు అయ్యి, ఏమైందిలే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాం, రాజకీయ బాసులు దృష్టిలో మంచి మార్కులు ఉంటే చాలు అనే అధికారులకు, రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఐఏఎస్ అధికారులు కోర్టుకు హాజరు అయ్యే విషయంలో రికార్డులు సృష్టిస్తున్నారు. నిన్న ఒక కేసు విషయంలో, ఏకంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులు కోర్టు ముందు హాజరు అయ్యారు. ఆ కేసులో ఎంత మంది అధికారులకు శిక్ష పడుతుందా అని అందరూ అనుకున్న సమయంలో, ఇప్పుడు మరో కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా అయుదు మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది హైకోర్టు. నెల్లూరు జిల్లాలో తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద నుంచి భూమి తీసుకుని, దానికి సంబంధించిన పునరావాసం, నష్ట పరిహారం ఇవ్వకపోవటంతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు దీని పైన, ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత, వాళ్ళు నష్ట పరిహారం ఇచ్చారు.
అయితే నష్ట పరిహారం ఇవ్వటంలో అనూహ్యమైన జాప్యం చేయటంతో, ఆమె మానసికంగా, ఆర్ధికంగా తీవ్ర క్షోభ అనుభవించింది అంటూ హైకోర్టు పేర్కొంది. ఈ నేపధ్యంలోనే మొత్తం అయుదు మంది ఐ ఏఎస్ ఆఫీసర్లకు, జైలు శిక్షతో పాటుగా, లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ లక్ష రూపాయలు కూడా ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి, ఆ మహిళకు చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఐఏఎస్ అధికారులకు విడివిడిగా కూడా జరిమానా విధించింది. ఈ శిక్ష మీద అపీల్ కు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను నిలిపుదల చేసింది. మన్మోహన్ సింగ్ అనే అధికారికి నెల రోజులు జైలు శిక్ష, అప్పట్లో నెల్లూరు కలెక్టర్ గా చేసిన శేషగిరి బాబుకు రెండు వారల జైలు శిక్ష, అలాగే ఇప్పుడు ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎస్ఎస్ రావత్ కు నెల రోజుల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు సియం పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ముత్యాల రాజుకి రెండు వారాల జైలు శిక్ష విధించింది. మొత్తానికి హైకోర్టు మాటలు వినకపోతే ఏమి అవుతుందో అర్ధం అవుతుంది.