ఏపీలో ఈనెల 6వ తేదీన ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందని చెప్పారు. గుంగూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసనపల్లిలోని 94వ నెంబర్ పోలింగ్ బూత్, పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ పోలింగ్ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ బూత్, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలలోని 247వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
రీపోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగానే పరిగణిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు సిద్ధంగా ఉంచుతామన్నారు. బెల్ కంపెనీ ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సీసీకెమెరాల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈవీఎంలు మొరాయించడం, పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, ఘర్షణలు తలెత్తడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బూత్ స్థాయిల్లో పరిస్థితులను పరిశీలించి అధికారుల నివేదిక మేరకు ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపాలని ఈసీ నిర్ణయించింది.
ఈ నెల 6వ తేదీన ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో, ఇక్కడున్న ఓటర్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని, మెజారిటీ స్వల్పంగానే ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో, ఈ పోలింగ్ బూత్ లలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను సంపాదించుకోవాలని అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలు వ్యూహాలను రచిస్తున్నాయి. నర్సరావుపేట నుంచి టీడీపీ తరఫున డాక్టర్ అరవిందబాబు, వైఎస్సార్సీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా, గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ తరపున మద్దాల గిరి, వైఎస్సార్సీపీ నుంచి చంద్రగిరి ఏసురత్నం బరిలో ఉన్నారు. కోవూరు నుంచి తెలుగుదేశం తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సూళ్లూరుపేటలో టీడీపీ తరఫున పరసా వెంకటరత్నం, వైసీపీ తరఫున కిలివేటి సంజీవయ్య, యర్రగొండపాలెం (ఎస్టీ) నుంచి టీడీపీ తరఫున బుదల అజితారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డాక్టర్ ఆదిమూలపు సురేష్ బరిలోకి దిగారు.