ప్రత్యేక హోదా, విభజన హామీలు కంటే, మన రాష్ట్రానికి రావలసిన అతి పెద్ద ఆస్తి, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లో వాటా... ఇది తెలంగాణా రాష్ట్రంలో నుంచి రావాలి కాబట్టి, అటు జగన్ కాని, ఇటు పవన్ కాని అడగడు... హైదరాబాద్ లో ఉంటూ, ఏపి రాజకీయలు చేసే ఎవరూ అడగరు... అటు కేంద్రం, పట్టించుకోదు... ముందు నుంచి ఈ సమస్య పై, కేవలం చంద్రబాబు మాత్రమే పోరాడుతున్నారు... తాజాగా చీఫ్ సెక్రటరీ స్థాయిలో మరో సమావేశం జరిగింది... రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల ఆస్తుల పంపకాలపై నాన్చుడు ధోరణిని విడనాడాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వీటి పంపిణీ కోసం కేంద్వ్రం నియమించిన షీలాబిడే కమిటీ ఇచ్చిన సిఫారసులను అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేసిందని, వాటి పంపకాలు కూడా దాదాపుగా జరిగిపోయినట్లేనని చెప్పింది.
సీఎస్‌ల పరంగానే గాక అధికారుల స్థాయిలోనూ భేటీలు జరపాలనే ప్రతిపాదనను ఆమోదించారు. విభజన సమస్యలపై శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో ఏపీ సీఎస్ దినేశ్‌కుమార్, తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఇరు రాష్ట్రాల ఎస్‌ఆర్ విభాగం ఉన్నతాధికారులు రామకృష్ణారావు, ప్రేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రక్రియకు అనుమతించాలని నిర్ణయించారు. సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పరస్పర బదిలీల అంశానికి సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత అనుమతించాలని నిర్ణయించారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు ఏపీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు.
మరోవైపు హైదరాబాద్‌లో సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీ వాటాగా వచ్చిన భవనాలు తమకు అప్పగించేయాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. తమ ముఖ్యమంత్రి తో చర్చించి చెప్తామని దినేశ్ సమాధానమిచ్చారు. మరోవైపు 9వ షెడ్యూలులో స్థిరాస్తులు లేని సంస్థలు కొన్ని అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో కొందరు ఉద్యోగులు, కొద్దిపాటి నిధులు మాత్రం ఉన్నాయి. వీటి విషయంలోనూ సానుకూల పంపకాలకు సుముఖత వ్యక్తమైంది. మరోవైపు హైదరాబాద్‌లోని మ్యూజియంలలో ఉన్న పురావస్తు సంపదను కూడా పంచాలని ఏపీ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఆయా మ్యూజియంలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కళాఖండాలు, ఇతర పురావస్తు సంపదను అప్పగించాలని అడిగారు. ఏపీ జెన్‌కోకు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ బకాయిలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటోంది. బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శిని అడిగారు.