జాతీయ నాయకుల సభలకు జనం రాక విలవిలలాడుతున్న రాష్ట్ర బీజేపీలో కలకలం మొదలైంది. పార్టీ కీలకనేత.. విజయనగరం ఎంపీ అభ్యర్థి.. పాకలపాటి సన్యాసిరాజు కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రచార సభల ఖర్చుపై జాతీయ నాయకత్వం నుంచి పడ్డ అక్షింతలే ఇందుకు కారణమని.. ఆ సెగ సన్యాసిరాజుకు తగిలిందని తెలిసింది. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో సన్యాసిరాజే గణనీయమైన స్థాయిలో కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేస్తున్నారని, అసలే ఏపీలో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీకి ఈ పరిణామం మరింత గట్టి దెబ్బ అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వస్తున్న జాతీయస్థాయి నాయకుల సభలు వెలవెలబోతున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల కృష్ణా జిల్లాకు వచ్చారు. అక్కడ కుర్చీలన్నీ దాదాపు ఖాళీగా ఉండటం చూసి అవాక్కయ్యారు.
విజయవాడ పర్యటన రద్దు చేసుకుని, విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించగా.. ‘మనకు అది బలం లేని ప్రాంతం. మీ సభలకు జనాన్ని భారీగా సమీకరిస్తాం’ అని హామీ ఇచ్చారు. కన్నా పోటీ చేస్తోన్న నరసరావుపేట, పురందేశ్వరి బరిలో నిలిచిన విశాఖపట్నంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో సైతం షాసభకు జనంముఖం చాటేశారు. అసహనానికి గురైన ఆయన అయిష్టంగానే విశాఖపట్నం వెళ్లారు. అక్కడ సభకు జనాన్ని సమీకరించలేక ర్యాలీ చేపడితే వందమంది కూడా కనిపించలేదు. దీంతో షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అక్కడ జనమేలేరు.. కానీ రూ.69లక్షలు ఖర్చు చేశారు, ఏం జరుగుతోంది ఏపీలో’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర పార్టీలో ఈ వ్యవహారం వేడి పుట్టించింది.
అటు తిరిగి ఇటు తిరిగి ట్రెజరర్ వద్ద ఆగింది. నిజాయితీగా పనిచేస్తున్న తనను అలా అనడం నచ్చని సన్యాసిరాజు కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. ఎక్కువ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకొంటారేమోనని నాయకత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో పార్టీ సభలకు వచ్చేందుకే ఎవరూ ఆసక్తి చూపట్లేదని.. మనిషికి రూ.500 ఇచ్చి తీసుకొచ్చినా రెండు గంటలకు మించి కూర్చోవడానికి ఇష్టపడట్లేదని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అన్ని స్థానాల్లోనూ ఎలాగోలా అభ్యర్థులను బరిలో దించిన బీజేపీ ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ల కోసం నానా పాట్లూ పడుతోంది. ‘పదో తరగతి ఫెయిలైనా పర్లేదు, పేరివ్వు చాలు... ఆ రోజుకు నీకు ఏదో ఇస్తాం’ అని బతిమాలుతున్నా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. పార్టీ కోశాధికారి సన్యాసిరాజు తప్పుకున్న 24 గంటల్లోనే, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ప్రచారానికి పార్టీ అధిష్టానం పంపిన డబ్బులో కోట్ల రూపాయలు దుర్వినియోగంపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అక్షింతలు వేయడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కల్లోలం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రానికి చేరిన రూ.70 కోట్లలో ఒకే నాయకుడి ఆధీనంలో ఉన్న రూ.30 కోట్లు దారి మళ్లినట్టు రాష్ట్రానికి చెందిన ఒక కీలక నాయకు డు కేంద్ర పార్టీకి నివేదిక ఇచ్చినట్టు చర్చ జరుగుతోం ది.