జనవరి ఆరవ తేదీ అర్థరాత్రి... సాంకేతికంగా ఏడవ తేదీలోకి ప్రవేశించాం... కానీ ఆ ఏడవ తేదీ వస్తూనే మనల్ని ప్రపంచ విజేతలను చేసింది. మన కలల పోలవరం ఆ విజయాన్ని నిజం చేసింది... ప్రపంచానికి సవాల్ విసిరి, దమ్ముంటే, మా రికార్డు ని అందుకోండి అంటూ, భారత దేశం తరుపున, ఆంధ్రుడు, ఈ ప్రపంచానికి సవాల్ విసిరాడు. ఆంధ్రా కంపెనీ అయిన నవయుగ, ఈ ఘనతని నిజం చేసింది. గాడాంధాకారాన్ని చీల్చుకుంటూ ఆకాశమంతా తానే అయ్యి ఉదయించే 'ప్రచండ భానుడు' ఆంధ్రుడు... బలితలినిడ యత్నించిన పాదాన్ని తిరగరాసి విశ్వరూపాన్ని వామనరూపం చేసిన చక్రవర్తి ఆంధ్రుడు... నిలకడ లేని గోదావరి జలాలను తన వెంట నడిపించి ధరిత్రికి పచ్చటి ఊపిరులూదే అపర 'భగీరథుడు' ఆంధ్రుడు... నవయుగ లిఖించింది నవశకపు చరిత్ర... పోలవరం సృష్టించింది ప్రపంచ నిర్మాణ రంగంలో చరిత్ర.. మన ఆంధ్ర శాసనం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో....
A అమరావతి, P పోలవరం, రెండూ కలిసి, AP, ఇవే నా ముందున్న లక్ష్యాలు అని చెప్పిన చంద్రబాబు, ఒక్కో అడుగు వేసుకుంటూ, ఆ కలను సాదిస్తున్నారు. ఇన్నాళ్లు దుబాయ్ పేరిట ఉన్న 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డు బద్దలైంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకల్లా 22,045 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసి నవయుగ ఇంజనీరింగ్ సంస్థ గిన్నిస్ రికార్డు సాధించింది. సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు.
2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమిచింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. అధికారులను అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సోమవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు. సమర్ధవంతమైన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఉంటే ప్రపంచ రికార్డులే కాదు .... ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ఆలాంటి అమూల్యమైన నాయకత్వాన్ని సమర్ధించడం , పరిరక్షించుకోవటం ప్రతి ఆంధ్రుడి బాధ్యత.