వైసీపీకి రెండు చేతులతో ఉద్యోగులంతా కలిసి ఓట్లేయించామని ఘనంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అవే రెండు చేతులతో జీతం ఇవ్వండి మహాప్రభో అని సర్కారుని వేడుకుంటున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు పడేవి. వైసీపీ వచ్చాక జీతం నెలలో ఏ రోజు పడుతుందో చెప్పలేని దుస్థితి. ఫిబ్రవరి రెండో వారంలోకి అడుగు పెట్టినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో అరవై శాతం మందికి జనవరి నెల జీతం, పెన్షనూ ఇప్పటికీ అందలేదు. ప్రతి నెల జీతభత్యాలకు కలిపి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఇప్పటివరకు రూ. 2 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయి. తొలివారం గడిచిపోయినా ఎక్కువమంది ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు. హౌసింగ్ లోన్లు, ఈఎమ్ ఐలు ప్రతీ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీలోగా పడుతుంటాయి. జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితిలో చెక్ లు బౌన్స్ అవుతాయనే భయంతో వడ్డీలకు అప్పులు తెచ్చి అక్కౌంటులో వేస్తున్నారు. జీతాలు గురించి గట్టిగా అడిగితే కేసులు బనాయిస్తారని వారి సంఘ నాయకులే భయపెడుతున్నారు. సుమారు 6లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. నెల నెలా జీతం వచ్చే తేదీ అలా అలా మారిపోతుండడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల గవర్నర్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నందుకు ఉద్యోగుల సంఘ నేతలకు నోటీసులు పంపింది ప్రభుత్వం. అలాగే కొన్ని ఉద్యోగ సంఘాల పెద్దలైతే జీతాలు, ప్రయోజనాల కోసం ఎవరైనా నోరెత్తితే వారిపై మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. ఓట్లేసిన చేతులు, గట్టిగా జీతాలు అడిగితే కేసులు..ఏం చేయాలో తెలియని గందరగోళంలో జీతాలు ఇవ్వండి మహాప్రభో అంటూ రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు.
వైసీపీకి ఓట్లేసిన రెండు చేతులతోనే జీతాలు ఇమ్మని ప్రార్థిస్తున్నారు
Advertisements