ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు నిజం చేసి చూపించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీవనం చిధ్రమై..బ్రతుకు భారమై కన్నీటి కడలిలో దేవుడా నీవే దిక్కు అంటూ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కేరళ వరద బాధితుల దయనీయ దుస్తితి చూసి ఉద్యోగస్తులందరూ చలించిపోయారు. తమవంతుగా కేరళ ప్రజలకు సాయం చేయాలని తలంచారు. ఆలోచన వచ్చిందే తడవుగా పెద్ద మనసుతో తమ సేవా తత్పరతను చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ రూ. 20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఉండవల్లిలో ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన ఎన్జీవో నేతలు ఆ మేరకు అంగీకార పత్రం అందజేశారు. ఎన్జీవో జేఏసీ నేతలు అశోక్ బాబు, జోసఫ్ సుధీర్ ల నేతృత్వంలో ఎన్జీవో నేతలు సీఎంను కలిసారు.
విజయవాడలో ఏపీ ఎన్జీవో హోం లో సమావేశమై కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ తరఫున రూ. 20 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. కేరళ లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవడంపట్ల సానుభూతితో విరాళాలు ఇవ్వడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పించనుదార్లు ఏకపక్షంగా ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 4.1లక్షల ఉద్యోగులు,మరో 4 లక్షల పించనుదార్లు విరాళాలు ఇవ్వటానికి సుముఖత తెలిపారన్నారు. ఎన్జీవో జేఏసీ సభ్యుల ఆగస్టు నెల జీతంలో ఈమేరకు మినహాయించాలని ముఖ్యమంత్రికి అందజేసిన అంగీకార పత్రంలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసి అక్కడి నుంచి కేరళ వరద బాధితుల సహాయార్థం పంపించాలని కోరారు.
మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు కూడా స్పందించారు. కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ఏపి ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళలో జరిగిన వరద బీభత్సానికి ఐఏఎస్లు అందరూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఆపన్న హస్తం అందించేందుకు తాము ముందుంటామని ఏపి ఐఏఎస్లు ధీమా వ్యక్తం చేశారు. సహాయ పునరావాస చర్యలలో తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. మరోవైపున కేరళ వరద బాధితుల సహయార్ధం కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి కృష్ణాజిల్లా అధికారులు వారి ఒకరోజు వేతనాన్ని స్వచ్ఛందంగా అందించాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని ఇవ్వడానికి జిల్లా అధికారులంతా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తమ వంతు విరాళంగా రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని శనివారం ప్రకటించారు.