ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఎందుకు చేస్తుందో, ఎందుకు వెనక్కు తీసుకుంటుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఏపి ప్రభుత్వం చర్యలు అన్నీ కన్ఫ్యుజింగ్ గా ఉంటాయి. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వాలు, తాము జారీ చేసిన జీవోలు అన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టేవి. ఆన్లైన్ లో ప్రజలు ఆ జీవోలు అన్నీ చూసుకునే వారు. అయితే ప్రభుత్వం అదే పనిగా రహస్య జీవోలు విడుదల చేయటం, అలాగే బ్లాంక్ జీవోలు విడుదల చేయటం, ఇలా అనేక అంశాలతో, ప్రభుత్వం విమర్శల పాలు అయ్యింది. ఏ జీవో ఎందుకు ఇస్తున్నారో కూడా ప్రజలకు తెలియటం లేదు. టిడిపి వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేయటంతో, గవర్నర్ కూడా ఆశ్చర్య పోయే పరిస్థితి. దీంతో వివాదం పెద్దది అవ్వటం, అలాగే రహస్య, బ్లాంక్ జీవోలు ఇవ్వకపోతే ఇబ్బంది అనుకున్నారో ఏమో కానీ, మొత్తానికి అసలు జీవోలు ఆన్లైన్ లో ఎందుకు పెట్టాలి, ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచాలి అనే ఆలోచన రావటంతో, ఏకంగా జీవోలు అన్నీ కూడా ఆన్లైన్ నుంచి తీసి పడేసారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత మంది ఏమి అనుకున్నా ప్రభుత్వం లెక్క చేయలేదు. దీని పై కొంత మంది కోర్టులో కూడా పిటీషన్ వేసారు. ఇది విచారణలో ఉంది. అయితే మళ్ళీ ప్రభుత్వం ఏమి అనుకొందో ఏమో కానీ, తమకు ఇష్టమైనవి మాత్రం చూపిస్తాం అంటుంది.
అది కూడా గతంలో ఇచ్చిన వేబ్సిట్ లో కాకుండా, https://apegazette.cgg.gov.in/ అనే వెబ్సైటులో తమకు కావాల్సిన జీవోలు పెడతాం అని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే రెండు పిటీషన్లు హైకోర్టులో ఉండటంతోనే, కోర్టుకు ఏమి చెప్పాలో తెలియక, ఇలా మధ్యే మార్గంగా అవసరమైన జీవోలు మాత్రమే పెడతాం అంటూ ముందుకు వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక నుంచి బయటకు ఇచ్చే జీవోలు అన్నీ కూడా, ఏపీ ఈ-గెజిట్ ద్వారానే అవసరం మేరకు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయాని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజలకు అవసరం లేనివి మాత్రం ఇక్కడ పెట్టం అంటుంది ప్రభుత్వం. మరి ప్రజలకు ఏది అవసరమో, ఏమిటో, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి, ప్రజల దగ్గర దాచేది ఏమి ఉంటుందో మరి. గోప్యత పేరుతో ఏమి దాచేస్తారో చూడాలి. ఎన్నో అదనపు అనవసర ఖర్చులు చేస్తూ ఇచ్చిన జీవోలు గతంలో వివాదాస్పదం అయ్యింది. ఇప్పుడు అలాంటివి అన్నీ దాచేసే అవకాశాలు ఉన్నాయని, అన్ని జీవోలు ప్రజల ముందు పెట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది.