తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అమలుచేసిన సంక్షేమపథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాలతో త్వరలో ఇంటింటికీ సంక్షేమ లబ్ధి పేరిట వినూత్న ప్రచార కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలల కాలవ్యవధిలో అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేరిట కరపత్రాలను ఈ కార్యక్రమం ద్వారా వారి ముందు ఉంచనున్నారు. రియల్ టైమ్ గవర్నె్‌స(ఆర్‌టీజీఎస్) ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి ఆయా మండల పరిషత్‌ల నుంచి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటికి ఆ వివరాలు చేర్చడం ద్వారా ప్రభుత్వం మీ కుటుంబానికి ఇప్పటివరకు ఏం చేసిందనే సంక్షేమ లబ్ధిని స్పష్టం చేయడం ద్వారా వారిని ఆకర్షించనున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం 57 నెలల కాలవ్యవధిలో ఆయా లబ్ధిదారులకు ఏయే సంక్షేమ కార్యక్రమాలను వర్తింపజేశారో స్పష్టం చేస్తూ ఆర్‌టీజీఎస్ ద్వారా సేకరించిన వివరాలను కరపత్రాల రూపంలో ఆ కుటుంబానికి అందించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇప్పటికే మండలంలో 40నుంచి 50 వేల మంది లబ్ధిదారులు ఆయా వర్గాల వారిని బట్టి ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమపథకాల ద్వారా ఏదో రూపంలో లబ్ధిపొందినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణాలు, పసుపు-కుంకుమ, గృహనిర్మాణం, అన్ని కేటగిరిల కింద పంపిణీచేసిన పెన్షన్లు, ఆదరణ-2 లబ్ధిదారుల వివరాలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిపొందినవారి వివరాలు, అభయహస్తం, యువనేస్తం, చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లికానుక, ఎస్సీఎస్టీ లబ్ధిదారులకు ఉచిత కరెంట్, విదేశీ విద్య, సీఎం సహాయనిధి, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్‌తోపాటు అనేక పథకాల ద్వారా లబ్ధిపొందినవారి జాబితాలు సిద్ధమవుతున్నాయి.
ఒక్కో కుటుంబయజమాని ఇంట్లో ఎవరూ ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారనే సమాచారం క్రోడీకరించి ఆ కుటుంబానికి అందజేస్తారు. గత 57 నెలలకాలంలో ప్రభుత్వపరంగా ఎప్పుడూ ఏఏ విధంగా సహాయసంక్షేమలబ్ధి పొందిందీ ఆ జాబితాలో పొందుపరుస్తారు. ఇప్పటికే వీటన్నింటినీ ఆర్‌టీజీఎస్ సహాయంతో మండల పరిషత్ కార్యాలయాల ద్వారా జాబితాలను సిద్ధంచేసి పంచాయతీల ద్వారా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందించనున్నారు. అతి త్వరలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా బినామీల పేరిట లబ్ధిపొందేవారి అసలు బండారం కూడా బహిర్గతం కానుంది. ముఖ్యంగా గృహనిర్మాణాలు, ఎస్సీఎస్టీల పేరిట రుణాల వంటి వాటిలో బినామీల బాగోతం బట్టబయలయ్యే అవకాశం కూడా ఉంది.