Source : https://epaper.prabhanews.com/c/50557839 కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులు పూర్తిగా పడిపోయింది అంటూ, ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్షన్లు రెండు విడతలుగా చెల్లింపు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏప్రిల్ 1న బ్యాంకులు సెలవు, రెండో తేదీన శ్రీరామనవమి సెలవు కావడంతో ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానట్లు చెబుతున్నారు. అయితే కోత విధించిన జీతాల చెల్లింపుపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి అంటూ చెప్పిన నేపథ్యంలో అన్ని రకాల బిల్లులను మార్చి 21వ తేదీనే పొందుపరచడం, కేటాయించడం జరిగిపోయాయి. ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సంబంధించి సీఎస్ఎంఎస్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి బ్యాంకులకు అనుసంధానం చేయడమే తరువాయి. అయితే మరో కొన్ని గంటల్లో జీతాల చెల్లింపు జరిగే చివరి సమయంలో ప్రభుత్వం, జీతాల్లో కోత పెడుతూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన గతంలో లేకపోవడంతో, ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్ధిక శాఖాధికారులు సతమతమవుతున్నట్లు తెలియవస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం జీతాలు చెల్లించాలంటే కోతకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి తిరిగి బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో తిరిగి పొందు పరచాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవరించిన బిల్లులు పెట్టాలంటే జీతాలు చెల్లించడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి, కాగా మార్చి నెలకు సంబంధించి 21 వరకే బిల్లులు పొందుపరచడం జరిగింది. తిరిగి బిల్లులు పెట్టాలంటే నెలాఖరు వరకు బిల్లులు పెట్టే అవకాశం ఉంది.
ఈ తరుణంలో అన్ని శాఖలు పూర్తి స్థాయిలో బిల్లులు రూపొందించనున్నాయి. దీంతో బడ్జెట్ అనుకున్న దాని కన్నా కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే నూతనంగా బిల్లులు పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన విధంగా జీతభత్యాలు చెల్లించే మార్గాలను ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది. ఇదిలా ఉండగా మార్చి నెల జీతాలకు సంబంధించి 21కే ప్రక్రియను పూర్తి చేసినందున సాంకేతికతంగా పూర్తి జీతభత్యాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వ ప్రకటన ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని చెబుతున్నారు. మార్చి నెలకు సంబంధించి ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ కలిపి సుమారు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదా పద్దతిలో చెల్లింపు కారణంగా సుమారు రూ. 2 వేల కోట్లు ప్రభుత్వం వద్ద నిల్వ ఉండనుంది. మొత్తం మీద ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయం ఉద్యోగులను కొంత ఆందోళనకు గురి చేసింది.